e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home Top Slides ఆన్‌లైన్‌ ఆటలో అంతా ఓటమే!

ఆన్‌లైన్‌ ఆటలో అంతా ఓటమే!

  • పేకాట, బెట్టింగ్‌లో ఇల్లు గుల్ల
  • యాప్‌లు, వెబ్‌సైట్లకు బానిసలవుతున్న యువత
  • అరచేతిలోనే వేలాది వెబ్‌సైట్‌లు, యాప్‌లు
  • మన రాష్ట్రంలో నిషేధం ఉన్నా లొకేషన్‌ చేంజ్‌

తక్కువ వ్యవధిలో ఎటువంటి శ్రమ లేకుండానే భారీగా సంపాదించాలన్న దురాశ చాలామందిని అనాదిగా జూదం వైపు లేదా పందాలవైపు నడిపిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలో ఇటువంటి వారి కోసం.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వందల సంఖ్యలో యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ ఆటల్లో గెలిచి కోటీశ్వరులైనవారు ఒక్కరూ లేకపోగా దురాశతో ఇండ్లు గుళ్ల చేసుకున్నవారు మాత్రం కోట్లల్లో కనిపిస్తారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌లకు విపరీతమైన క్రేజ్‌ మొదలైంది. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ ఆటలు అందుబాటులో ఉండటంతో పోలీసులు పట్టుకుంటారనే భయం లేకుండా ఇంట్లోనే కూర్చొని ఆడేస్తున్నారు. సొంతంగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పెట్టుకొని వేల రూపాయలను పందెం కాస్తున్నారు. కొన్ని లక్షల మంది ఆన్‌లైన్‌లో జూదం ఆడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా యువత ఈ వ్యసనానికి బానిసలవుతున్నట్టు పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఇండ్లకే పరిమితమవుతున్న వారు మానసిక ఒత్తిడిని దూరం చేసుకొనేందుకు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జూన్‌ 26 (నమస్తే తెలంగాణ): ఆన్‌లైన్‌ జూదం రాష్ట్రంలోని పలు పట్టణాలకు అంటువ్యాధిలా పాకింది. దీంతో వివాహ జీవితంలో సమస్యలు మొదలవుతున్నాయి. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నవారు ఆ సొమ్మును తిరిగి పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పెండ్లికాని యువకులైతే ఇంట్లో తల్లిదండ్రులను డబ్బుల కోసం పీడిస్తున్నారు. డబ్బు నష్టపోయిన బాధను మరిచిపోయేందుకు సిగరెట్లు, మద్యం లేదా డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. కొందరు బాధితులు గ్రూపులుగా ఏర్పడి డబ్బు సంపాదించేందుకు తప్పుడు మార్గాలను ఎంచుకొని పోలీసులకు దొరికిపోతున్నారు.

రోజూ 100 కోట్ల వరకు బెట్టింగ్‌!

- Advertisement -

ఒక ప్రముఖ వెబ్‌సైట్‌, యాప్‌లో సభ్యులుగా ఉన్నవారు రోజూ కాసే బెట్టింగుల విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆయా యాప్‌లు, వెబ్‌సైట్‌ సంస్థలు వెల్లడించిన తమ సభ్యుల సంఖ్యను బట్టి పోలీసు అధికారులు, సైబర్‌ విశ్లేషకులు ఈ అంచనాకు వచ్చారు. ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు రట్టుచేసిన ఓ బెట్టింగ్‌ ముఠా కేసులో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశారు. పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా హైదరాబాద్‌ శివారులోని నిజాంపేటలో స్థావరాన్ని ఏర్పాటుచేసింది. వారు ప్రధాన బుకీ నుంచి లైన్‌ తీసుకుని ఏపీ, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి సభ్యులను చేర్చకుని వారికి పాస్‌వార్డు, యూజర్‌ ఐడీలను ఇచ్చి బెట్టింగ్‌లను నిర్వహించారు. ఆ మ్యాచ్‌లలో ఎవరు ఆడుతున్నారో తెలియకుండానే చాలామంది తమ డబ్బును పందెం కాశారు. ఈ ముఠా 13 రోజుల్లో 10 మ్యాచ్‌లపై రూ.20 కోట్ల మేర బెట్టింగ్‌ నిర్వహించింది. ఈ బెట్టింగుల్లో పందెంరాయుళ్లకు ఎంత వచ్చిందో తెలియదు కానీ బుకీలకు మాత్రం లక్షల్లో మిగిలింది. ఒక బెట్టింగ్‌లో ప్రధాన బుకీ నుంచి చివరి వరకు దాదాపు 25 దశల్లో బుకీలు ఉంటారయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక బుకీ ప్రతి మ్యాచ్‌కు రూ.4 లక్షలు కమీషన్‌ పొందారని వెల్లడైంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కరోనా కాలంలో ఇంట్లో ఉంటూ కాలక్షేపానికి ఆన్‌లైన్‌లో పేకాట ఆడాడు. గెలిచింది ఏమీ లేకపోగే రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.

లొకేషన్‌ చేంజ్‌

తెలంగాణలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా జూదంపై నిషేధం అమలులో ఉంది. సాధారణంగా జూదానికి సంబంధించిన యాప్‌లు, వెబ్‌సైట్‌లకు ఇక్కడ యాక్సెస్‌ లభించదు. దీంతో నిర్వాహకులు ఇతర రాష్ర్టాల ద్వారా ఇక్కడివారికి లింక్‌లు అందిస్తున్నారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే ఆ జూదానికి సంబంధించిన యాప్‌, వెబ్‌సైట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో లొకేషన్‌ ఆ ప్రాంతంలోనిది చూపిస్తుంది. అంటే సభ్యుడు ఇక్కడ ఉన్నా వారు ఆడేది మాత్రం మరో ప్రాంతం నుంచి అన్నట్టు లొకేషన్‌ను చూపిస్తుంది. ఇలా సాంకేతికతను వాడుకుని పందెంరాయుళ్లను నిండా ముంచుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లో పేరెంట్స్‌ నిఘా ఆప్షన్‌

ఇంట్లో పిల్లలు, పెద్దలు క్రికెట్‌ బెట్టింగ్‌లు, పేకాట ఆడుతున్నారా? అయితే వారిని కట్టడి చేసేందుకు స్మార్ట్‌ఫోన్లలో ఓ ఆప్షన్‌ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అందులో పేరెంటల్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిని ఎనేబుల్‌ చేసుకోవాలి. అందులో నిఘా పెట్టే వారి ఫోన్‌ నంబరును ఎంట్రీ చేయాలి. అలా చేయగానే ఓ కోడ్‌ వస్తుంది. ఈ కోడ్‌ను మనం చూడాలనుకుంటున్న ఫోన్‌లో ఎంట్రీ చేయాలి. అంతే ఆ ఆప్షన్‌ యాక్టివేట్‌ అయ్యి ఇక అతను ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఏం ఆడుతున్నాడు.. ఇలా అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. వెంటనే వారిని కట్టడి చేయొచ్చు. అయితే ఈ అప్షన్లు యాక్టీవేట్‌గా ఉండాలంటే ఇద్దరి వద్ద అండ్రాయిడ్‌ ఫోన్‌లు ఉండాలి.
-సందీప్‌ ముదల్కర్‌, సైబర్‌ విశ్లేషకుడు.

అవసరం ఉంటేనే ఫోన్‌ ఇవ్వండి

ముందుగా పిల్లలను మొబైల్‌ ఫోన్‌కు దూరం ఉంచాలి. లేదా ఇంట్లో ఉన్న వైఫైతోనే ఇంటర్నెట్‌ చూసుకునేలా చేయాలి. మొబైల్‌ డాటా ఇవ్వొద్దు. ఇంట్లోని వైఫైలో పరిమితికి మించి డాటాను వాడకుండా నియంత్రించుకోవచ్చు. ఫోన్‌ కాకుండా ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ వాడేలా చూడాలి. దీంతో వారు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారో పూర్తి నిఘా ఉంటుంది.

  • చకిలం సాయిప్రసాద్‌, సైబర్‌ విశ్లేషకుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana