శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:13

ముందే వరద

ముందే వరద

  • నేటిసాయంత్రానికి జూరాల చేరనున్న జలాలు
  • నారాయణపుర నుంచి రెండుగేట్లద్వారా విడుదల
  • గోదావరి బేసిన్‌లో ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
  • లక్ష్మీ బరాజ్‌కు 50వేల క్యూసెక్కుల ప్రాణహిత నీళ్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లో వరద సవ్వడి మొదలైంది. మొన్నటిదాకా ఆల్మట్టి జలాశయంతో దోబూచులాడిన వరద ఇప్పుడు 50-70 వేల క్యూసెక్కులతో స్థిరంగా వస్తున్నది. దీంతో కర్ణాటక అధికారులు దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆల్మట్టికి ఆదివారం ఉదయం 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. నీటినిల్వ 96 టీఎంసీలకు చేరింది. జలాశయం నుంచి కరెంటు ఉత్పత్తి ద్వారా రెండురోజులుగా 35వేల క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో నారాయణపురలోనూ నీటినిల్వ పెరుగుతున్నది. 37.64 టీఎంసీల పూర్తినిల్వకు ఆదివారం ఉదయం 35 టీఎంసీలకు చేరుకోవడంతో అధికారులు రెండుగేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరిగేకొద్దీ నీటి విడుదల పరిమాణాన్ని కూడా పెంచనున్నారు. 

గతేడాది జూలై 27-28 తేదీల్లో ఆల్మట్టికి వరద పెరుగుతూ వచ్చింది. గతేడాది జూలై 28న (ఆదివారమే) నారాయణపుర ప్రాజెక్టు నుంచి 10వేల క్యూసెక్కులు వదిలారు. ఆపై వరద ఉద్ధృతి లక్ష క్యూసెక్కులు దాటింది. ఈసారి నారాయణపుర నుంచి పదిహేను రోజులు ముందుగానే కృష్ణాజలాలు జూరాలవైపు పరుగులు తీశాయి. నారాయణపుర నుంచి జూరాల 185 కిలోమీటర్లు కాగా.. జూరాలకు చేరుకోవడానికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది. సోమవారం సాయంత్రం జలాలు జూరాల జలాశయాన్ని తాకనున్నాయి. మరోవైపు తుంగభద్రకు కూడా ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం ఉదయం సుమారు 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. ఉజ్జయినికి మూడువేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రకాశం బరాజ్‌కు ఎగువ నుంచి వరద పెరుగుతుండటంతో పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరి జలాల మళ్లింపును ఏపీ అధికారులు నిలిపివేశారు. 

గోదావరికీ స్థిరంగా వరద

గోదావరి బేసిన్‌లోనూ వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఆదివారం లక్ష్మీబరాజ్‌కు 50వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. దీంతో అధికారులు బరాజ్‌ వద్ద 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువన సరస్వతి బరాజ్‌కు వెయ్యి క్యూసెక్కుల వరద వస్తున్నది. కడెంకు 500, ఎల్లంపల్లికి 345 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌కు ప్రస్తుతం పదకొండు వేల క్యూసెక్కుల పైచిలుకు వరద నమోదవుతున్నది. కడెం ద్వారా ఎల్లంపల్లికి వరద పెరిగితే కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌-2 ద్వారా జలాలను ఎస్సారార్‌, ఆపై ఎల్‌ఎండీ, మరోవైపు అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 

కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులు నెమ్మదిగా జలకళను సంతరించుకుంటున్నాయి. గతేడాది కంటే 15 రోజులు ముందుగానే తెలుగు రాష్ర్టాలను పలుకరించేందుకు కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతున్నది. ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతుండటంతో కర్ణాటక అధికారులు నారాయణపుర నుంచి రెండుగేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నేటి సాయంత్రానికి జలాలు జూరాల జలాశయానికి చేరనున్నాయి. ఎస్సారెస్సీకి వరద నమోదవుతుండగా.. లక్ష్మీబరాజ్‌కు 50వేల క్యూసెక్కుల ప్రాణహిత జలాలు వచ్చిచేరుతున్నాయి. 

ప్రతి ఎకరాకూ సాగునీరు

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోజూరాల కాల్వలకు నీరు 
  • వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆదివారం రాత్రి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, గద్వాల, అలంపూర్‌, మక్తల్‌, దేవరకద్ర ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలతో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష 4 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది వానాకాలంలో రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం కింద రూ.7,283 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.  

తాజావార్తలు


logo