శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:58:52

వరద గోదారి.. కృష్ణా జలసిరి

వరద గోదారి.. కృష్ణా జలసిరి

  • రెండు బేసిన్లలో భారీ వరద 
  • శ్రీశైలానికి 2.28 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న ప్రవాహం 
  • సింగూర్‌కు నాలుగు రోజుల్లో 11 టీఎంసీలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. భారీగా జలాలు వస్తుండటంతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జూరాలకు భారీగా వరద వస్తుండటంతో శుక్రవారం 19 గేట్లను తెరిచి దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 1,48,600 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,61,416 క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి ఇన్‌ఫ్లో 16,922 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 16,922 క్యూసెక్కులు, నారాయణపుర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 20,884 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 23,471 క్యూసెక్కులు, టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 20,842 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 21,304 క్యూసెక్కులుగా నమోదైంది.   శ్రీశైలం జలాశయానికి 2,28,249 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. శుక్రవారం సాయంత్రం డ్యాం ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి  1,97,264 క్యూసెక్కులను దిగువకు వదలారు. నాగార్జునసాగర్‌కు 1,71,748 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో నమోదైంది. నాలుగు రోజుల్లో 11 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 14 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 

ఉగ్ర గోదావరి 

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1,20,874 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 40 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 8,512 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1390.25 అడుగుల వద్ద 4.14 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎల్లంపల్లికి 1,88,806 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 20 గేట్లు ఎత్తి దిగువకు 1,69,460 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పార్వతి బరాజ్‌కు 1,69,460 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 60 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి బరాజ్‌కు 1.52 లక్షల క్యూసెక్కుల నీరు రాగా 25 గేట్ల నుంచి అదేస్థాయిలో నీటిని వదులుతున్నారు. లక్ష్మి బరాజ్‌లో 46 గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2,25,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,97,900 క్యూసెక్కుల అవుట్‌ఫ్ల్లో కొనసాగుతున్నది. 

భువనగిరికి గోదారమ్మ 

గోదావరి జలాలు గురువారం సాయంత్రం  భువనగిరి నియోజకవర్గాన్ని ముద్దాడాయి. రెండు నెలలుగా కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని విడుదల చేసి ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదావరి జలాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో వర్షాలు కూడా తోడవ్వడంతో భువనగిరి పట్టణ పరిధిలోని పెద్ద చెరువులోకి గోదావరి, వరద కలగలిసిన నీళ్లు సమృద్ధిగా వచ్చి చేరుతున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి గ్రావిటీ ద్వారా బస్వాపూర్‌ (నారసింహ) రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి భువనగిరి నియోజకవర్గానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ పనులు తుది దశకు చేరుకుంటున్న దశలోనే అనుకోని వరంలా గోదావరి జలాలు భువనగిరిని తాకాయి. పెద్ద చెరువు నీటితో తొణికిసలాడుతుండటంతో స్థానికులు సంబురపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మస్తు వానలు సాధారణం కంటే 42% అధిక వర్షాలు

 రాష్ట్రంలో మస్తు వానలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వానలతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోయాయి. చాలా గ్రామాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఈ ఏడాది వానకాలంలో శుక్రవారం నాటికి.. రాష్ట్రంలో సాధారణం కంటే 42% అధికంగా వర్షం కురిసినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం శుక్రవారం నాటికి 694.3 మిల్లీమీటర్ల వర్షం కురియాల్సి ఉండగా 988.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నది. మొత్తం 33 జిల్లాలకు గాను 23 జిల్లాల్లో సాధారణం కంటే మించి వానలు పడ్డాయని, మిగిలిన పది జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైనట్టు వివరించింది. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ లోటు వర్షపాతం లేకపోవడం ఈసారి రైతన్నలకు సంతోషానిస్తున్న వార్త.  


logo