శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 06, 2020 , 02:12:52

బీమా, నెట్టెంపాడుకు నీటివిడుదల

బీమా, నెట్టెంపాడుకు నీటివిడుదల

  • జూరాలకు కొనసాగుతున్న వరద

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ ధరూర్‌, మహదేవ్‌పూర్‌, మెండోరా: కృష్ణా బేసిన్‌లో జూరాల ఎగువన పరివాహకంలో కురిసిన వర్షాలతో జలాశయానికి మోస్తరు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 9.66 టీఎంసీలకుగాను ఇన్‌ఫ్లో 5,703 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఆదివారం సాయంత్రానికి 7.04 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం జూరాల జలాశయం నుంచి భీమా, నెట్టెంపాడు పథకాల ద్వారా నీటిని ఎత్తిపోయడం ప్రారంభమైంది.

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం చిన్నగోప్లాపురం గ్రామం వద్ద భీమా పంప్‌హౌజ్‌ లిఫ్ట్‌-1 నుంచి మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలోని నెట్టెంపాడ్‌ నుంచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నీటి విడుదలను ప్రారంభించారు. మరోవైపు, ఎగువన ఆల్మట్టికి వరద తగ్గుముఖం పట్టింది. ఇటీవల 50 వేల పైచిలుకు క్యూసెక్కుల వరదరాగా.. ఇప్పుడు అది పదివేలలోపే వస్తున్నది. ఇటు ఉజ్జయిని ప్రాజెక్టుకు నాలుగు వేల క్యూసెక్కుల స్వల్ప వరద వస్తుండగా.. తుంగభద్ర డ్యాంకు కొన్నిరోజులుగా వస్తున్న వరద కూడా తగ్గుముఖం పట్టింది.


వరద కాల్వకు తరలుతున్న జలాలు

శ్రీరాంసాగర్‌ వరద కాల్వను నింపాలంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి జలాల తరలింపు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి వద్ద 2,321 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. ఈ జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంపుహౌజ్‌లోని ఒక మోటరు ద్వారా గాయత్రి పంపుహౌజ్‌.. ఆపై వరద కాల్వకు తరలిస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం మోస్తరుగానే కనిపిస్తున్నది. శ్రీరాంసాగర్‌కు ఐదున్నర వేల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దిగువన పెరూరు వద్ద సుమారు పద్దెనిమిదివేల క్యూసెక్కుల వరకు వరద దిగువకు ప్రవహిస్తున్నది. 



logo