బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 16:43:07

డిస్కంలకు ఇచ్చే అప్పులో ఒక శాతం తగ్గించాలి : మంత్రి జగదీష్ రెడ్డి

డిస్కంలకు ఇచ్చే అప్పులో ఒక శాతం తగ్గించాలి : మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : విద్యుత్ చట్ట సవరణ అంటేనే రాష్ట్రాల హక్కులను హరించి వేయడమే నని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాపై జాతీయ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సదస్సులో  మంత్రి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా,ట్రాన్స్ కో అండ్ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ యస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. విద్యుత్ సౌదా నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రధానంగా కేంద్రం డిస్కంలకు ఇచ్చే రుణాల పై వడ్డీ తగ్గించాలని ప్రతిపాదించారు. కొవిడ్ తో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు ఇచ్చే రుణాల మీద ఒక శాతం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే విద్యుత్ చట్ట సవరణ చట్టం తెలంగాణ రైతాంగానికి గొడ్డలి పెట్టు లాంటిదని అభివర్ణించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా పై కేంద్రానికి స్పష్టంగా లేఖ రాసిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ బిల్లు వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం చేకూరక పోగా గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లు ను వ్యతిరేకిస్తూన్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని మిగితా రాష్ట్రాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూన్నా  బిల్లులో సింగిల్ లైన్ కూడా మార్పుకు నోచుకోక పోవడం దురదృష్టకరమన్నారు. విద్యుత్ రంగంపై రాష్ట్రాల హక్కులను కేంద్రం ఈ బిల్లు ద్వారా ఆధీనంలోకి తీసుకొని ప్రయివేట్ పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అదే విధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ 270 మెగావాట్లు అనుసంధానించామని ఆయన ప్రకటించారు. ఈ రోజు నుంచి అక్కడ ఉత్పత్తి ప్రారంభమైనట్లు మంత్రి జగదీష్ రెడ్డి  వెల్లడించారు.  దురదృష్టవశాత్తు కొందరు న్యాయస్థానలలో కేసులు వెయ్యడంతో కొంత ఆలస్యమైందన్నారు. మూడో యూనిట్ ను కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. భద్రాద్రిలో పూర్తి స్థాయిలో అంటే 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించ బోతున్నట్లు మంత్రి తెలపారు.


తాజావార్తలు


logo