శనివారం 11 జూలై 2020
Telangana - May 26, 2020 , 01:52:44

వంద టన్నుల ద్రాక్ష.. ఒక్కరైతు మార్కెటింగ్‌

వంద టన్నుల ద్రాక్ష.. ఒక్కరైతు మార్కెటింగ్‌

  • కరోనా కాలంలో కర్షకుడి విజయగాథ
  • ఏడెకరాల పంటను రిటైల్‌గా అమ్మిన అంజిరెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా ఓ కర్షకుడికి మార్కెటింగ్‌ పాఠాలు నేర్పింది. తాను పండించిన పంటను తను నిర్ణయించిన ధరకే ఎలా అమ్ముకోవాలో చూపించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడకు చెందిన అంజిరెడ్డి ఏడెకరాల్లో ద్రాక్ష తోట సాగుచేశారు. పంట చేతికొచ్చి, అమ్ముకొనే సమయానికి లాక్‌డౌన్‌ ప్రకటించారు. మార్కెట్లు మూతపడటం, రవాణా సౌకర్యం లేక వ్యాపారులు ఎవరూ ముందుకురాలేదు. తన ఫోన్‌లోని వా ట్సాప్‌ నంబర్లతో గ్రూప్‌ను తయారుచేసి ‘అమ్మకానికి ద్రాక్షపండ్లు’ అంటూ ఓ మెస్సేజ్‌ను షేర్‌ చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్‌ చేయాలంటూ సూచించారు. తక్కువ ధరకు పండ్లు దొరుకడం, నేరుగా తోట వద్దే లభిస్తుండటంతో జిల్లాతోపాటు, హైదరాబాద్‌ నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  వ్యవసాయక్షేత్రంలోనే ద్రాక్షను ప్యాక్‌చేసి కిలో రూ.40 చొప్పున 70 క్వింటాళ్లు విక్రయించారు.

సహకరించిన ఉద్యానవనశాఖ

లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌కు పండ్ల రవాణా కోసం ఉద్యానశాఖ నుంచి అనుమతి తీసుకున్న. వాట్సాప్‌, ఫోన్ల ద్వారా వచ్చిన ఆర్డర్ల మేరకు కిలో రూ.50 చొప్పున 33 క్వింటాళ్ల ద్రాక్షను నగరంలోని పలు కాలనీలు, అపార్ట్‌మెంట్లకు సరఫరాచేశా. 43 రోజుల్లోనే 103 టన్నుల ద్రాక్ష విక్రయించా. ఖర్చులుపోగా రూ.16.50 లక్షల ఆదాయం వచ్చింది. నా విజయగాథను తెలుసుకున్న ఉద్యానశాఖ డైరెక్టర్‌ ఎల్‌ వెంకట్రామిరెడ్డి నన్ను హైదరాబాద్‌కు పిలిపించి మరీ అభినందించారు. 

-రైతు అంజిరెడ్డి 


logo