మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:43:35

మరోసారి సాదాబైనామా

మరోసారి సాదాబైనామా

  • 58, 59 జీవోలకు కూడా..
  • ఇక.. ఈ ఒక్కసారే అవకాశం
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సాదాబైనామాకు చివరగా ఒక్కసారి అవకాశమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. ‘సాదా బైనామా, 58, 59 జీవోలపై సభ్యులు చాలామంది మాట్లాడినరు. మరోసారి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినరు. జీవో 58, 59... సాదా బైనామాపై ఒక్క అవకాశం ఇచ్చిన తర్వాత ఇగ 58, 59 అనేదే ఉండదు. ఏదైనా లావాదేవీ జరగాలంటే రిజిస్ట్రేషన్లు జరగాల్సిందే. మంత్రివర్గ సమావేశం పెట్టి, అందరి అభిప్రాయాలు తీసుకొంటం. ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తం. చివరి అవకాశం ఇస్తం. ఆతర్వాత కేవలం రిజిస్ట్రేషన్లే. లేకపోతే అంతు ఉండదు. బర్కాస్‌ కర్‌దేంగే. లేకపోతే నియంత్రణ రాదు. పేదల సంక్షేమంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నది. నీతిఆయోగ్‌, యూఎన్వో, ప్రపంచబ్యాంకు కూడా ఇదే చెప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సాదాబైనామా చేసింది గానీ ఫీజు పెట్టింది. అది కూడా చాలా తక్కువమందికి చేసింది. 11.19 లక్షల దరఖాస్తులు వస్తే.. 6.18 లక్షల ఎకరాలను ఒక్క రూపాయి ఫీజు లేకుండా క్రమబద్ధీకరించినం. పేదల కోసం మూడుసార్లు పొడిగించినం. మరోసారి పెట్టాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నరు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటం. అవసరమైతే 15 రోజులు అవకాశమిస్తం. పేదలను ఆదుకోవడంలో మేం ఎప్పుడూ ముందున్నం. అంతకుముందు పేదల గుడిసెలు అంటే బుల్డోజర్‌ పెట్టి కూలగొట్టేటోళ్లు. అప్పటి ప్రభుత్వాలు రాక్షసంగా ఉండేవి. పేదలకు నివాస స్థలాల విషయంలో మేం వారికి అండగా ఉన్నం. 58 జీవో ప్రకారం వందగజాల వరకు ఉండే జాగకు ఉచితంగా అంతకంటే ఎక్కువ ఉంటే 59 జీవో ప్రకారం కొంత చార్జీలతో 1,40,328 మందికి క్రమబద్ధీకరించినం. వీటిలో ఎక్కువగా హైదరాబాద్‌ నగరంలో, వరంగల్‌ వంటి చోట కొద్దిగా ఉన్నయి. మరోసారి పేదలకు అవకాశం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తం. పెద్ద సంస్కరణల సమయంలో పేదలకు ఇబ్బంది రానియ్యం. క్యాబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలా చూస్తా. ఆర్వోఎఫ్‌ఆర్‌, వ్యవసాయ భూములు కానివి వ్యవసాయేతరం కిందకి వస్తాయి. గ్రీన్‌జోన్‌లలో ఎలాంటి నిర్మాణాలకు ఆస్కారంలేదు. హెచ్‌ఎండీఏ పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌జోన్‌లను ప్రకటించేలా చూస్తం.logo