సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 18:38:41

హైదరాబాద్‌లో మళ్లీ వాన.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో మళ్లీ వాన.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

హైద‌రాబాద్ : న‌గ‌రాన్ని భారీ వ‌ర్షం మ‌రోసారి చుట్టుముట్టింది. శ‌నివారం సాయంత్రం నుంచి న‌గ‌రాన్ని కుండ‌పోత వాన క‌మ్మేసింది. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, వనస్థలీపురం, కూకట్‌పల్లి, మలక్‌పేట, రాయదుర్గం, షేక్‌పేట, మదీనా, చార్మినార్‌, బహదూర్‌పురా, జూపార్క్‌, పురానాపూల్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌సాగర్‌, సరూర్‌నగర్‌, చంపాపేట్‌, రామంతాపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, తార్నాక, లాలాపేట్‌, ఓయూ క్యాంపస్‌, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్‌, మెహదీపట్నం, కార్వాన్‌, జియాగూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట త‌దిత‌ర ప్రాంతాల్లో కుండ‌పోత వాన కురిసింది. దీంతో రోడ్లపై వ‌ర‌ద‌ నీరు పోటెత్తింది. ఆఫీసుల ప‌నివేళ‌లు ముగిసి అంతా ఇంటికి తిరిగి చేరుకునే స‌మ‌యంలో వ‌ర్షం చుట్టుముట్ట‌డంతో వాహ‌నదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం వరకు, అబ్దుల్లాపూర్‌మెట్‌-ఇనామ్‌గూడ హైవేపై, బీఎన్‌రెడ్డి నగర్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌ వద్ద, మేడిపల్లి-ఉప్పల్‌ వరకు, హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మూసారంబాగ్‌ వంతెనపై రాకపోకలను నిషేధించారు. గోల్నాక వంతెనపై నుంచి వాహనాల దారి మళ్లింపుతో రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. సికింద్రాబాద్‌ ప్రాంతంలోనూ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.  

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ..

మ‌రోమారు భారీ వ‌ర్షం నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అప్రత్తమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్ స్పందిస్తూ... అత్యవసర సహాయ బృందాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బందిని పంపిన‌ట్లు చెప్పారు. రహదారులపై నీరు నిలువకుండా చర్యలు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌జ‌ల‌కు పోలీస్‌శాఖ సూచ‌న‌..

భారీ వ‌ర్షాల‌పై పోలీసుశాఖ ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేసింది. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్దంది. చిన్న పిల్ల‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. విద్యుత్ పోల్స్‌, వైర్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో తాక‌వద్దంది. వ‌ర‌ద‌నీటిలోకి వెళ్లే స‌హసం చేయ‌వ‌ద్దని తెలిపింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల్సిందిగా పోలీసులు కోరారు. పురాత‌న‌, శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వ‌నాలు వీడాలంది. బైకులు, కార్లు వ‌ర‌ద‌లో చిక్కుకుంటే ముందు వాటిని వ‌దిలి ముందుకు బ‌య‌ట‌ప‌డాలన్నారు. ఏ ఆప‌ద వ‌చ్చినా 100 నెంబ‌ర్‌కు కాల్ చేయాల్సిందిగా పేర్కొన్నారు. 

శ‌నివారం పొద్దంతా ఎండ రాగా సాయంత్రం ఒక్కసారిగా ప‌రిస్థితి మారింది. ఆకాశం తీవ్ర‌ మేఘావృతమై భారీ వ‌ర్షం చుట్టిముట్టింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 


logo