సోమవారం 25 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:42:13

ఢిల్లీ వెళ్లినవారిలో వైరస్‌ సోకింది..ఎందరికి?

ఢిల్లీ వెళ్లినవారిలో వైరస్‌ సోకింది..ఎందరికి?

-మర్కజ్‌కు వెళ్లొచ్చింది వెయ్యికి పైనే.. 

-ఒక్క హైదరాబాద్‌నుంచే 603 మంది

-వారి కోసం 200 బృందాలతో గాలింపు.. 

-జిల్లాల్లో పదుల కొద్దీ బృందాలతో అన్వేషణ

-ప్రార్థనలకు వెళ్లిన వారిలో చాలామందికి పాజిటివ్‌..  

-తగ్గుతుందనుకున్న తరుణంలో షాక్‌

-మర్కజ్‌కు వెళ్లినవారిని గుర్తిస్తున్న అధికారులు.. 

-పలు జిల్లాల్లో క్వారంటైన్లకు తరలింపు

-ఏపీలో ఒకేరోజు 17 పాజిటివ్‌ కేసులు..

-ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా బాధితులు

-రాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి ఆందోళన.. 

-గాంధీ దవాఖాన వద్ద పటిష్ఠమైన బందోబస్తు 

ఢిల్లీలో మర్కజ్‌ ఉదంతం రెండు తెలుగు రాష్ర్టాలను ఉలిక్కిపడేలాచేసింది. తబ్లిగీ జమాత్‌ మసీదులో జరిగిన మతప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో తెలంగాణవాసులు ఆరుగురు మరణించడం, పదుల సంఖ్యలో కరోనా వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. తెలంగాణ నుంచి వెయ్యిమందికి పైగా మర్కజ్‌కు వెళ్లి  వచ్చినట్లు ప్రాథమిక అంచనాకు రావడంతో వారివల్ల ఎందరికి కరోనా సోకిందన్న కలవరం మొదలైంది. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారంతా రైళ్లు, బస్సుల్లో ప్రయాణించడం.. ఆ తర్వాత సామూహికంగా ప్రజల మధ్యన తిరుగటం.. దవాఖానలకు వెళ్లటం వల్ల ఈ వైరస్‌ వ్యాప్తిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కడికక్కడమర్కజ్‌ యాత్రికులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించడానికి దాదాపు రెండు వందల బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటివరకు విదేశాలనుంచి వచ్చినవారికే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారితోపాటు.. వారు కలిసిన వారందరినీ క్వారంటైన్‌చేసి పరీక్షలు నిర్వహించడం, చికిత్సలు, పర్యవేక్షణలు కొనసాగించారు. తెలంగాణకు సంబంధించి పాజిటివ్‌ వచ్చిన వారిలో పద్నాలుగు మంది ఇప్పటికే నయమై డిశ్చార్జి అయిపోయారు కూడా. క్వారంటైన్‌లో ఉన్నవారు కూడా సోమవారం నుంచి దశలవారీగా విడుదలవుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి సజావుగా కొనసాగితే ఏప్రిల్‌ 7 తర్వాత ఒక్కకేసు కూడా ఉండదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా మర్కజ్‌ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. తెలంగాణలో 15 మందికి మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వీరంతా మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారు.. వారి బంధువులేనని వెల్లడించారు. మర్కజ్‌నుంచి వచ్చినవారంతా గాంధీ దవాఖానలో పరీక్షలు చేయించుకోవడానికి రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి విజ్ఞప్తిచేశారు. ఒక్క హైదరాబాద్‌ నుంచే 603 మంది మర్కజ్‌నుంచి తిరిగి వచ్చినట్లుగా జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. మంగళవారం హైదరాబాద్‌లోని 463 గృహాల్లో సుమారు 200 బృందాలు వీరికోసం గాలింపుచర్యలు నిర్వహించాయి. 74మంది అనుమానితులను దవాఖానలకు పంపించారు. 348 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 41 మందిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. జిల్లాల్లో కూడా పదుల కొద్దీ బృందాలు మర్కజ్‌ యాత్రికులకోసం గాలిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఏపీలో మంగళవారం ఒక్కరోజే 17 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీరంతా మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చినవారే. 

గాంధీ దవాఖానలో గట్టి బందోబస్తు

మార్చి రెండోవారంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు ఇండోనేషియా, సౌదీ అరేబియా, కజికిస్థాన్‌, మలేషియా వంటి పలు దేశాల ప్రతినిధులతో పాటు దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి భారీగా జనం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి 711 మంది హాజరైనట్లు తేలింది. తెలంగాణ నుంచి 1030 మంది  వెళ్లినట్లు అంచనా. వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్‌ వస్తుండటంతో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు పంపించేందుకు ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొంటున్నాయి. హైదరాబాద్‌ గాంధీ దవాఖానలో మర్కజ్‌ ప్రార్థనలకు హాజరై తిరిగి వచ్చినవారిలో కొందరికి పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు లేనివారిని వెంటనే ఇంటికి పంపించారు. రాష్ట్ర డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి పర్యవేక్షణలో సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఎంవోలతో కలిసి అనుమానితులకోసం ప్రత్యేకంగా బయటిరోగుల విభాగాన్ని ఏర్పాటుచేశారు. ప్రత్యేక కౌంటర్లలో పీజీ వైద్యులను నియమించారు. 6, 7, 8 అంతస్తుల్లో 60 మంది అనుమానితులకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. ఉస్మానియా నుంచి నలుగురు ల్యాబ్‌ టెక్నిషియన్లను డిప్యుటేషన్‌పై గాంధీకి పంపించారు. వరంగల్‌ ఎంజీఎం దవాఖాన  నుంచి 20 వెంటిలేటర్లు వచ్చాయి. మరో మూడు వెంటిలేటర్లను అపోలో దవాఖాన విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. దీంతో గాంధీ దవాఖానలో వెంటిలేటర్ల సంఖ్య 71కి చేరింది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన దాదాపు 500 మంది అనుమానితులు రానున్నారని సమాచారం రావడంతో గాంధీ మైదానంలో జీహెచ్‌ఎంసీ బేగంపేట సర్కిల్‌ ఉపకమిషనర్‌ ముకుంద్‌రెడ్డి.. అవసరమైన ఏర్పాట్లుచేశారు. గాంధీ దవాఖాన వద్ద మంగళవారం గట్టి బందోబస్తును ఏర్పాటుచేశారు. బోయిగూడ, ముషీరాబాద్‌వైపు నుంచి గాంధీ దవాఖానవైపు వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. పలు ప్రభుత్వ దవాఖానల ఉద్యోగులు, సిబ్బంది విధులకు సజావుగా హాజరై, తిరిగి ఇండ్లకు  చేరుకోవడానికి 16 రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీస్‌లను ప్రారంభించింది. సచివాలయ అధికారికి కరోనా అనుమానం

తెలంగాణ సచివాలయంలో మర్కజ్‌లో జరిగిన మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన ఒక సెక్షన్‌ అధికారికి కరోనా సోకే అవకాశమున్నదని భావించిన అధికారులు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ అధికారికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

జిల్లాల్లోనూ కల్లోలం

మర్కజ్‌ వ్యవహారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కల్లోలం రేపింది. ఉమ్మడి పది జిల్లాల్లో మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు తలమునకలయ్యారు. మొత్తం 1030 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు భావిస్తున్నారు. వీరిలో మంగళవారం పలువురిని వివిధ జిల్లాల్లో గుర్తించి దవాఖానలకు తరలించి పరీక్షలు నిర్వహించారు. అనుమానితుల శాంపిళ్లను ధ్రువీకరణకు హైదరాబాద్‌ పంపించారు. అనంతరం వారిని క్వారంటైన్లకు తరలించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 27 మందిని, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12, ఆదిలాబాద్‌ జిల్లాలో 109, నల్లగొండ జిల్లాలో 55, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 95, కరీంనగర్‌ జిల్లాలో 50, జహీరాబాద్‌లో 19 మందిని క్వారంటైన్‌కు పంపించారు. మంచిర్యాల జిల్లాలో పది మంది వెళ్లినట్లు తేలినా ఇద్దరిని గుర్తించి క్వారంటైన్‌చేశారు. మిగిలినవారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఏపీలో కఠినంగా లాక్‌డౌన్‌

మర్కజ్‌ వ్యవహారంతో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఏపీలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం పలు ఆదేశాలు జారీచేశారు. సరిహద్దుల వద్ద లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంచేశారు. పలుప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడ్తున్నారు. కర్నూలు, విజయవాడ ప్రాంతాల్లో మర్కజ్‌ నుంచి కరోనా అంటించుకొని వచ్చినవారు ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కర్నూలు నుంచి 189 మంది మర్కజ్‌ వెళ్లివచ్చినట్లు గుర్తించారు. వీరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాకపోకలు సాగించారని భావిస్తున్నారు. గుంటూరు నుంచి మర్కజ్‌కు వెళ్లిన 184 మందిలో 145 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన 39 మంది వారి ఇండ్లలో లేరు. కొందరు తప్పుడు అడ్రస్‌ ఇచ్చారు. వీరిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రకాశం జిల్లాలో మంగళవారం 11 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. వీరంతా రైళ్లలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లినవారేనని అధికారులు ప్రకటించారు. 

పరీక్షలు చేయించుకోవాలి: సీఎం కేసీఆర్‌

మర్కజ్‌నుంచి వచ్చిన వారందరూ గాంధీ దవాఖానలో పరీక్షలు చేయించుకొనేందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వారి బంధువులను కూడా పరీక్షలకు తీసుకురావాలని కోరారు. డయాలిసిస్‌, తలసేమియా, సికెల్‌ సెల్‌ జబ్బులున్నవారికి రక్తమార్పిడి అవసరమవుతుందని, కాబట్టి వీరు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. పోలీసులు వీరిని అడ్డుకోవద్దని సూచించారు.15 మందికి పాజిటివ్‌:  మంత్రి ఈటల

మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 15 మందికి (ఇందులో కొందరు వారి బంధువులు) మంగళవారం కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌-19 వైరస్‌ బారినపడ్డ వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అధునాతన వైద్యసేవలను అందిస్తున్నదని వివిధ ప్రాంతాల నుంచి రాష్టానికి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారిలో కరోనా పాజిటివ్‌గా నమోదైన 77 మందికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన పలు దవాఖానల్లో వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి సహకరించాలని ఈటల కోరారు.ఏపీలోని వివిధ జిల్లాలో పాజిటివ్‌గా తేలిన కేసులు

ప్రకాశం     11

విశాఖ     10

గుంటూరు      9

కృష్ణా      5

తూర్పుగోదావరి    4

అనంతపురం      2

చిత్తూరు      1

కర్నూలు      1

నెల్లూరు      1

మొత్తం కేసులు     44


logo