శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 03:14:16

పరిశుభ్ర పట్టణాలుగా..

పరిశుభ్ర పట్టణాలుగా..
  • చురుగ్గా పట్టణ ప్రగతి పనులు
  • మెండుగా ప్రజల భాగస్వామ్యం
  • పాల్గొంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు

నమస్తే తెలంగాణనెట్‌వర్క్‌: పట్టణ ప్రగతి కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతుండటంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తున్నది. ఎనిమిదో రోజైన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా పాల్గొన్నారు.


చెత్త బుట్టల పంపిణీ: పువ్వాడ

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో సోమవారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నా రు. స్థానిక సుందరయ్య నగర్‌లో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ పార్క్‌ను ప్రారంభించి మొక్కలు నాటారు. మధిర చెరువును ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌ మాదిరిగా తీర్చిదిద్దుతానని మంత్రి హామీనిచ్చారు. చెత్తను సేకరించేందుకు పట్టణంలో 22 వేల బుట్టలను ప్రజలకు అందించాలన్నారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.


పారిశుద్ధ్య పనుల పరిశీలన: అల్లోల

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సోమవార్‌పేట్‌, బేస్తవార్‌పేట్‌ వార్డుల్లో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. మురికి కాల్వలు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. కాల్వలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌, చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో సోమవారం సాయంత్రం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కలెక్టర్‌ శశాంక పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డుల్లో తిరుగుతూ స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పట్టణాల అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని మంత్రి గంగుల కోరారు.


మౌలిక వసతుల కల్పన: మల్లారెడ్డి

మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మేయర్‌ బుచ్చిరెడ్డితో కలిసి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. 
logo