సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:36:26

చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి

చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి

  • పుస్తకావిష్కరణ సభలో వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాతనే చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ చెప్పారు. ఎంసీహెచ్చార్డీలోని రుద్రమహాల్‌లో శనివారం ఆయన ‘కాకతీయ హరిటేజ్‌', ‘జనగణ మన తెలంగాణ’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాకతీయ చారిత్రక కట్టడాలతోపాటు, ఇతర చారిత్రక నేపథ్యం ఉన్న నిర్మాణాల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదన్నారు. రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు తేవాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. కరీంనగర్‌ జిల్లాలోని నంగునూరు, కొత్తపల్లిలోని కాకతీయుల నాటి పురాతన దేవాలయాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే  మొదటిరాణిగా రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యబాధ్యతలు నిర్వర్తించి ఖ్యాతిని గడించారని తెలిపారు. రుద్రమదేవి స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతం మహిళా చైతన్యానికి కేంద్రస్థానంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్‌ జనరల్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, హెరిటేజ్‌ ట్రస్టీలు పాపారావు, ప్రొఫెసర్‌ పాండురంగారావు, గోపాలకృష్ణ, ఇంటాక్‌ అధ్యక్షురాలు అనురాధ, గౌతమ్‌ పింగ్లే తదితరులు పాల్గొన్నారు.logo