బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 13, 2020 , 03:45:13

పండుగ వేళ నూనెలు సలసల

పండుగ వేళ నూనెలు సలసల

సంక్రాంతి పండుగవేళ ఒక్కసారిగా వంట నూనెలు, పప్పుల రేట్లు భగ్గుమన్నాయి. పండుగ సీజన్ నేపథ్యంలో రేట్లు రెండింతలు పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో ప్రస్తుతం రూ.98 నుంచి రూ.100 దాకా పలుకుతుండగా.. పామాయిల్ కిలో రూ.85 నుంచి రూ.90 వరకు ధర ఉన్నది.

  • పప్పుదినుసుల ధరలూ పైపైకి
  • రూ.5 నుంచి రూ.20ల పెరుగుదల
  • అంతర్జాతీయంగా నూనె, పప్పుధాన్యాల దిగుమతులు తగ్గడమే కారణం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇప్పటికే పెరిగిన ఉల్లి, వెల్లుల్లి ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడింది. సంక్రాంతి పండుగవేళ ఒక్కసారిగా వంట నూనెలు, పప్పుల రేట్లు భగ్గుమన్నాయి. పండుగ సీజన్ నేపథ్యంలో రేట్లు రెండింతలు పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో ప్రస్తుతం రూ.98 నుంచి రూ.100 దాకా పలుకుతుండగా.. పామాయిల్ కిలో రూ.85 నుంచి రూ.90 వరకు ధర ఉన్నది. ఇక వేరుశనగ నూనె రూ.120గా ఉన్నది. దేశంలో ఏటా 15 మిలియన్ టన్నుల వంట నూనెలు అవసరమవుతుండగా.. దానిలో ఎనిమిది మిలియన్ టన్నుల నూనెలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అందులో అధికశాతం మలేషియా, ఇండోనేషియాల నుంచే వస్తున్నాయి. ఈ రెండు దేశాలు సుంకాలు పెంచడంతో నూనెల ధరలకు రెక్కలొచ్చాయి.

పెరిగిన దిగుమతి సుంకాలు 

అంతర్జాతీయంగా రూపాయి మారకపు విలువ పడిపోవడంతోపాటు దిగుమతి సుంకాలు పెరుగడం పప్పుధాన్యాలు, నూనెగింజల దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. దిగుమతులు తగ్గిపోవడంతో వీటి ధరలకు పెరిగాయి. అన్ని రకాల వంట నూనెలు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయని మార్కెట్‌వర్గాలు తెలిపాయి. రిటైల్ మార్కెట్‌లో నూనె లీటర్ రూ.5 నుంచి రూ.20 దాకా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ ప్రకటించింది.  

దేశంలో తగ్గిన కందిపంట సాగు

పప్పుదినుసుల పరిస్థితి మరోలా ఉన్నది. గతేడాది వానకాలంలో దేశవ్యాప్తంగా కంది పంట 2.60 లక్షల హెక్టార్లకే పరిమితమయింది. మరోవైపు పప్పుధాన్యాలను ఎక్కువగా సాగుచేసే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో కూడా దిగుబడి ఇదే రీతిలో ఉండటంతో విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల్లో వర్షాభావం వల్ల సాగు తగ్గిపోవడంతో దిగుమతులు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ధరలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.95- రూ.102 మధ్యఉండగా, నల్లగొండలో రూ.102, మహబూబ్‌నగర్‌లో రూ.100గా ఉన్నది. గతేడాది కిలో రూ.76-రూ.80 పలుకగా, ఆ రేటుతో పోలిస్తే ఇప్పుడు సుమారు రూ.20 పెరిగింది. అటు పెసరపప్పు, మినప పప్పు ధరలు ఇదేరీతిలో ఉన్నాయి. కిలో పెసరపప్పు రూ.105కు విక్రయిస్తుండగా.. మినప పప్పు రూ.115-రూ.120ల మధ్య ఉన్నది.


logo