శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 22, 2020 , 16:18:01

రాష్ట్రంలో విరివిగా ఆయిల్ పామ్ సాగు: మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో విరివిగా ఆయిల్ పామ్ సాగు: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాబోయే రెండేళ్ల కాలంలో 18వేల, వంద హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ లో ఆయిల్ పామ్ విస్తరణకు కేంద్ర అనుమతి ఇచ్చినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గతంలో అవగాహన లేక ఆయిల్ పామ్ సాగుపై తెలంగాణ రైతులు దృష్టి పెట్టలేదని మంత్రి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. కేంద్రం నుంచి వచ్చిన అధ్యయన కమిటీ.. రాష్ట్రంలో రెండు సార్లు పర్యటన చేసి ఆయిల్ పామ్ సాగుకు అనుమతి ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఆయిల్ పామ్ సాగులో ఎకరానికి ఏడాదికి 1లక్ష 20వేల నుంచి 1లక్ష 50వేల వరకు ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ పంటను ప్రభుత్వమే కొంటుందనే గ్యారంటీ ఉందని మంత్రి తెలిపారు.

యేటా మన దేశానికి 21 మిలియన్ టన్నుల  వంట నూనెల అవసరం ఉంటుందనీ.. అందుకు గాను 75 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక నుంచి పామాయిల్ కు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసే దౌర్భాగ్యం ఉండదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ పెంపకం కోసం దేశంలో ఇంత పెద్ద స్థాయిలో అనుమతి ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో 50వేల ఎకరాలకు ఆయిల్ పామ్ పథకం ద్వారా రాయితీ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పామ్ ఆయిల్ ధర టన్నుకు 12 వేలు ఉందనీ.. నేను స్వయంగా 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

పంట సాగుకు  షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి 100 శాతం, బీసీ చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ కల్పిస్తన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగించుకొని, లాభాల బాట పట్టాలన్నారు. ఈ పంట సాగుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలు సిద్దం చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు.


logo