సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:30:36

అమ్మ.. బీజేపీ!

అమ్మ.. బీజేపీ!

  • ఇదా మీ అసలు కుట్ర
  • హైదరాబాద్‌ను ఏం చేస్తరు?  
  • సంజయా.. నీది నోరా, మోరా? 
  • లేఖ రాశావ్‌.. రాయలేదన్నావ్‌  
  • ఒట్టు వేశావ్‌.. ధర్మాన్ని ఒగ్గేశావ్‌
  • ఓట్ల కోసం ఇంత దిగజారాలా?  
  • ప్రజలను బలిచేయాలా?

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక, ప్రచారం మొదలైన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వరదసాయం పంపిణీ చేస్తే దానిపై మా పార్టీ రాష్ట్రశాఖ నుంచి ఉత్తరం రాయడంలో తప్పుందని నేను భావించట్లేదు. 

- బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలు

ఎన్నికలు వస్తే చాలు బీజేపీ పార్టీది 

ఒకటే ఎజెండా.. ఎలాగైనా గెలవాలి అంతే. తప్పుడు పోస్టులు సృష్టించినా పర్లేదు. మతోన్మాదాన్ని ప్రేరేపించినా తప్పులేదు. కావాలంటే ఒట్టేసి చెప్తాం అంటారు. వార్తల్లో నిలవడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. దానికి ఉదాహరణే.. లేఖాస్త్రం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేరుతో ఉన్న ఈ లేఖపై సోషల్‌ మీడియా కోడై కూసింది. పలు చానళ్లు ప్రసారం చేశాయి. డిబేట్లు పెట్టాయి. అదేంటో మరి ఫేక్‌ సృష్టించేది బీజేపీ వాళ్లే, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించేదీ వాళ్లే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అడ్డదారులు తొక్కి దొరికిపోయేదీ వాళ్లే.

అదే ట్రిక్‌.. మళ్లీ అదే ట్రిక్‌.. మళ్లీ మళ్లీ అదే ట్రిక్‌.. అంతా ఫేక్‌. ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజలను మభ్యపెట్టడమే బీజేపీ పని. మతం పేరెత్తి మనోభావాలను తట్టిలేపుతుంది. ఆ పార్టీ నేతలైతే ‘నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కడానికి వీల్లేదు’ అంటూ ఎంత దూరమైనా వెళ్తారు. ప్రజలకు మంచి జరిగే వాటినీ ఆపేస్తారు. వాళ్లకు కావాల్సింది ఒక్కటే.. ఓటు. ఆ ఓటు కోసం కావాలంటే స్లైన్‌ పే చర్చా అని కూడా అంటారు. అదేనండోయ్‌! ఎన్నికలకు రెండ్రోజుల ముందు చక్కెర వచ్చి హాస్పిటల్లో చేరిపోతారు. అప్పుడు వాళ్ల నటన నవరస నటనా సార్వభౌములే అవాక్కయ్యేలా ఉంటుంది. అందరిలోకెళ్లా బండి సంజయ్‌ నటన ఇంతింత కాదయా. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు వచ్చాయి కదా.. తన నటనకు ఇంకాస్త పదునుపెట్టారాయన. నగారా మోగినప్పటి నుంచే ఆయన తన నటనను మొదలుపెట్టేశారు. తమకే సాధ్యమైన ఫేక్‌ ప్రచారాన్ని బీజేపీ స్టార్ట్‌ చేసింది. ముందుగా.. వరదసాయం ఆపితే, ఆ తర్వాత ఏదైనా చేయొచ్చని అనుకొని దానిపై గురిపెట్టారు. సాయం ఆపే శక్తి ఎన్నికల సంఘానికే ఉంది. నోటిఫికేషన్‌ విడుదలప్పుడు ఏం కాలేదు, 24 గంటల తర్వాత వరదసాయం నిలిపివేయాలని అర్ధాంతరంగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని వెనుక సంజయ్‌ ఉన్నారా? అంటే.. సోషల్‌ మీడియాలో రచ్చ లేపిన లేఖే సాక్ష్యం. ఆ లేఖ వల్ల వేలమందికి సాయం అందకుండాపోయింది. ప్రజలకూ అర్థమైపోయింది.. బీజేపీనే అంతా చేసిందని. ఇంత దారుణమా? ఇంత దుర్నీతా? ఓట్ల కోసం ఇంత దిగజారుడుతనమా? అంటూ బాధితులు ఆ పార్టీపై దుమ్మెత్తిపోశారు. ఏదో తేడా కొడ్తదని, ప్రజలు తమకు ఓట్లు వెయ్యరని గ్రహించిన సంజయ్‌.. మీడియా ముందుకొచ్చి ‘వరదసాయం ఆపాలని ఎన్నికల సంఘానికి లేఖ నేను రాయలేదు’ అని చెప్పారు. కావాలంటే చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిపై ప్రమాణం చేస్తానని అన్నారు. రెండ్రోజులు ఆగి.. తర్వాత ఆలయానికి వెళ్లి ప్రమా ణం చేశారు. అది ఏ ప్రమాణమో, చేసిన తప్పును క్షమించాలని వేడుకున్నారో? తెలియదు కానీ.. లేఖ రాయలేదని ప్రమాణం చేశానని సంజయ్‌ చెప్పుకొచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్‌.. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియా ముందుకొచ్చి బాంబ్‌ పేల్చారు. లేఖ రాసింది నిజమేనా అని అడగ్గానే.. ‘ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక, ప్రచారం మొదలైన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వరదసాయం పంపిణీ చేస్తే దానిపై మా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి ఉత్తరం రాయడంలో తప్పుందని నేను భావించట్లేదు’ అని సమాధానం ఇచ్చారు. ఆయన ప్రకారం.. బీజేపీయే ఆ లేఖ రాసిందన్నట్టు. ఆ లేఖ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా భాగ్యలక్ష్మి ఆలయ నాటకం ఆడారా? మతం పేరు చెప్తే లేఖ దృష్టిని మరల్చవచ్చని బండి సంజయ్‌ భావించారు. కానీ, బీజేపీ కుట్రకు దగాపడ్డ ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు. ఇక, అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. ఏకంగా ఎన్నికల సంఘం మీదే అభాండం వేశారు కొందరు. ‘వరదసాయం ఆపాలని పార్టీలు మాకు లేఖలు రాయలేదు. అవన్నీ ఉత్త పుకార్లే’ అని ఓ చిన్న పత్రికలో స్టేట్మెంట్‌ ఇప్పించారు. అదెక్కడి నుంచి వచ్చి పేపర్లో చేరిందో గానీ.. ఆ వార్తే పెద్ద వదంతి. అసలు నిజం ఏంటంటే.. ఎన్నికల సంఘం ఏ స్టేట్మెంట్‌ విడుదల చేయలేదు. ఏ వివరణ ఇవ్వలేదు. 

తప్పుడు చేతల నుంచి తప్పటడుగుల దాకా..

ఎన్నికల వేళ అన్ని పార్టీలు చేసే యుద్ధం ఒకటైతే, బీజేపీ చేసేది మరొకటి. ఆ పార్టీది వెన్నుపోటు యుద్ధం. ప్రజలను మభ్యపెట్టేందుకు, నాయకులను పడగొట్టేందుకు సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేందుకు అస్సలు వెనుకాడదు. కాలనాగులా విషాన్ని చిమ్ముతుంది. ఆ పార్టీది, ఆ పార్టీ నేతలది అదే తీరు. దానికి ఈ వారమే జరిగిన రెండు ఉదాహరణలు ఉన్నాయి. 1. లేఖ, 2. సర్జికల్‌ స్ట్రైక్స్‌. లేఖతో ప్రజలపై విషాన్ని చిమ్మిన ఆ పార్టీ.. ఇప్పుడు సర్జికల్‌ స్టైక్స్‌ అంటూ మరో విషాన్ని చిమ్ముతున్నది. ఈ రెండు సందర్భాల్లో ప్రధాన నిందితుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయే. హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేయడానికి కంకణం కట్టుకొని వచ్చాడు.

చివరగా చెప్పేదేంటంటే..

ఈ మొత్తం సీన్ను ఓ సారి పరిశీలిస్తే లేఖ రాసింది బీజేపీనే, రాయలేదన్నది బీజేపీనే, అవును రాశాం అని వివరణ ఇచ్చింది బీజేపీనే. అదీకాక, ఎన్నికల సంఘంపై అభాండం వేసిందీ బీజేపీనే. ‘ద ప్రింట్‌' ప్రకారం.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. ఆయన దాన్ని ఉపయోగించి సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో ఫేక్‌ వార్తలు ప్రచారమవుతున్నాయో పరిశీలించారు. అందులో నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. బీజేపీ కోసం 18 వేల ట్విట్టర్‌ అకౌంట్లు ఫేక్‌ వార్తలను ప్రచారం చేస్తున్నాయట.