శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 02:46:10

ఆఫ్‌లైన్‌ టీచర్లు తల్లిదండ్రులే

ఆఫ్‌లైన్‌ టీచర్లు తల్లిదండ్రులే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ నిబంధనల కారణంగా స్కూల్‌ విద్యార్థులకు కొనసాగుతున్న డిజిటల్‌ పాఠాల బోధనలో వారి తల్లిదండ్రులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు పిల్లలను స్కూల్‌కు సిద్ధం చేసినట్టుగానే ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు వారిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలతోపాటు వారుకూడా పాఠాలు వింటూ అనుమానాలు నివృత్తి చేస్తున్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు సెకండ్‌ టీచర్‌గా మారిపోతున్నారు. ప్రస్తుతం చాలావరకు చిన్న కుటుంబాలే కావడంతో పిల్లల కోసం తల్లిదండ్రుల్లో ఒకరు ఉద్యోగం మానుకొని ఇంటివద్దనే ఉంటున్నారు. ప్రైవేటు రంగంలో, చిన్నజీతాలకు పనిచేస్తున్న తల్లులే తమ ఉద్యోగాన్ని త్యాగం చేస్తున్నారు. పిల్లల విషయంలో ప్రస్తుతం తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని, ఇది అభినందనీయమని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లు అంటున్నారు. 

మార్చిలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు..?

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయా లు, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సీబీఎస్‌ఈ పాఠశాలల్లో వచ్చే మార్చిలో బోర్డు పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా? లేక ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించక పోతేఆన్‌లైన్‌ పాఠాలు విజయవంతమయ్యేవి కావని ప్రిన్సిపాళ్లు చెప్తున్నారు. కేంద్రీయ విద్యాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే తరగతులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జనవరిలో తరగతులు ప్రారంభి స్తే.. అందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.  


logo