గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:43:12

డిసెంబర్‌ 31నాటికి ‘సీతారామ’ సిద్ధం

డిసెంబర్‌ 31నాటికి ‘సీతారామ’ సిద్ధం

  • సాగు, తాగునీటి విడుదల
  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో కలిసి ఏరియల్‌ సర్వే

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు నుంచి డిసెంబర్‌ 31నాటికి సాగు, తాగు నీటిని అందిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ములకలపల్లి పంప్‌హౌజ్‌ నుంచి 8 ప్యాకేజీల పరిధిలోని 110 కిలోమీటర్ల మేర మంత్రి పువ్వాడ, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ తదితరులు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్‌ 31కల్లా ప్రాజెక్ట్‌లోని అన్ని ప్యాకేజీలను పూర్తిచేస్తామన్నారు. దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. పాలేరు పాత కాలువ ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఈ ప్రాజెక్ట్‌ పనులపై సమీక్ష జరగనున్నదన్నారు. సీతమ్మ బరాజ్‌ పనులకు సీఎం కేసీఆర్‌ త్వరలో శంకుస్థాపన చేస్తారని వివరించారు. మంత్రివెంట కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎమ్వీ రెడ్డి, ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు ఉన్నారు.logo