మంగళవారం 02 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 18:22:50

అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి

గజ్వేల్  : అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఉదాసీనంగా వ్యవహారించవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, అడిషనల్ కలెక్టర్ ముజంబీల్ ఖాన్, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ కృష్ణారెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎవరికి దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు తీవ్రస్థాయిలో అనిపిస్తే, కనిపించినా వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించాలని, వారికి వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. గజ్వేల్‌ పట్టణంతో పాటు గాజులపల్లి, అహ్మద్‌నగర్‌, మాదన్నపేట గ్రామాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

ఇంటింటి సర్వే చేపట్టి గ్రామాలలో ప్రతి వ్యక్తి నివేదికను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయా గ్రామాలలో ఎవరిని బయటకు రానియవద్దని, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను ఏర్పాటు చేయాలని పోలీసులను, అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గజ్వేల్‌ పట్టణంలో జిల్లాలో కరోనా నివారణ, గజ్వేల్‌ పట్టణంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పర్యటించిన పలు గ్రామాలలో చేపడుతున్న చర్యలపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ముజమిల్‌ఖాన్‌, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి కలసి వైద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నివాస ప్రాంతంలో పర్యటించారు. అనంతరం గజ్వేల్ విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

డిల్లీలో జరిగిన జమాతేకు జిల్లా నుంచి ఐదుగురు వెళ్లి వచ్చారని, గజ్వేల్‌ పట్టణానికి చెందిన వ్యక్తితో పాటు ములుగు మండలం, అక్కన్నపేట, మద్దూరు, చేర్యాల మండలాలకు చెందిన వ్యక్తులు వెళ్లగా, వీరిలో ఒక్కరికీ నెగటివ్‌ వచ్చిందని, గజ్వేల్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మిగిలిన ముగ్గురుకి సంబంధించిన రిపోర్టులు గురువారం సాయంత్రానికి వస్తాయని మంత్రి తెలిపారు. గజ్వేల్‌ వ్యక్తి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నదని, మార్చి 19న కాచీగూడకు చేరుకున్న గజ్వేల్‌ వ్యక్తి 19,20 తేదీలలో గజ్వేల్‌ పట్టణంతో పాటు దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లి, అహ్మద్‌నగర్‌, మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి మధిర గ్రామమైన మాదన్నపేటకు వెళ్లారని 20న సాయంత్రం నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. అయితే గజ్వేల్‌ వాసికి సంబంధించి కుటుంబసభ్యులతో పాటు 12మంది సంబంధించి టెస్టులను సీసీఎంబీకి పంపామని, శుక్రవారం సాయంత్రానికి రిపోర్టులు వస్తాయని తెలిపారు. 

వీరితో పాటు మరో 12మంది కాంటాక్ట్‌లను సీసీఎంబీకి పంపనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌, సీపీల ఆధ్వర్యంలో గజ్వేల్‌ పట్టణంతో పాటు గాజులపల్లి, మాదన్నపేట, అహ్మద్‌నగర్‌లలో పూర్తిస్థాయిలో వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, ఇంటింటా సర్వే చేపడుతున్నామని, ఆయా గ్రామాలలో ప్రజలను పూర్తిస్థాయిలో గృహా నిర్భంధంలోనే ఉంచామని తెలిపారు. మిగిలిన ముగ్గురికి సంబంధించిన రిపోర్టుల ఆధారంగా ఆయా గ్రామాలలో చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కరోనా పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి సహాకరిస్తే చాలన్నారు. 

గజ్వేల్‌ పట్టణానికి చెందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఇంటి చుట్టూ పక్కల గల 499 ఇళ్లను గుర్తించామని, ఆ ఇళ్లలో 1986మందిని గుర్తించామని వారికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ ఇళ్లకు సంబంధించిన వ్యక్తులు పోలీసులు, వైద్యాధికారులకు పూర్తిగా పూర్తి స్థాయిలో సహాకరించాలని మంత్రి కోరారు.  ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రోజుకు 3 సార్లు హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నామని, మొత్తం 30 బృందాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు సహాకరించాలని, ఇళ్లను వదిలి బయటకు రావొద్దని సూచించారు. దగ్గర పడిందనుకున్న దశలో డిల్లీ ఘటనతో అక్కడక్కడా బయటపడుతుందని, అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం రాత్రి 1.30గంటల వరకు కరోనా విషయమై సమీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. 

జిల్లా వ్యాప్తంగా ఆయా దేశాల నుంచి వచ్చిన 564 మందిలో 480 మందికి సంబంధించిన క్వారంటైన్‌ సమయం పూర్తయిందని, మరో 84 మందికి సంబంధించిన సమయం మరో వారం రోజులలో ముగియనున్నదని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలిసిన వారు స్వయంగా వచ్చి అధికారులకు తెలిపి, ప్రభుత్వానికి సహాకరించాలని మంత్రి కోరారు. చెబితే నేరం చేసిన వారవుతామని భావించోద్దని, ప్రజలకు, ప్రభుత్వానికి, సమాజానికి మంచి చేసిన వారవుతారన్నారు. గజ్వేల్‌ వాసిని కలిసి చెప్పని వారే నేరం చేసిన వారవుతారని చెప్పారు. జ్వరం, దగ్గులాంటివి ఏమి వచ్చిన వెంటనే 100 లేదా 108 నెంబర్లకు డయల్‌ చేయాలని లేదా గజ్వేల్ గడ అధికారికి, ఆర్డీవోలకు తెలియజేయాలని మంత్రి ప్రజలను కోరారు. బాన్సువాడ, నల్గోండలలో జ్వరం, దగ్గు లేకున్నా కరోనా పాజిటివ్‌ వచ్చిందని మంత్రి తెలిపారు. నాకేం రాదులే.. అని అనుకోవద్దని, కనీస జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. పేద ప్రజలకు బియ్యం పంపిణీలో ఏలాంటి ఇబ్బందులు కల్పించవద్దని, లాక్‌డౌన్‌కు రాబోయే 12 రోజులు కీలకమైనవని, ప్రజలంతా పూర్తి స్థాయిలో సహాకరించాలని కోరారు. పోలీసులు, వైద్యాధికారులకు ప్రజలు సహాకరించాలని మంత్రి కోరారు.


logo