శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 20:33:46

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి : మంత్రి ఈశ్వర్‌

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి : మంత్రి ఈశ్వర్‌

జగిత్యాల : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగ్గా.. హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా 13 శాఖలకు సంబంధించిన అంశాలపై సంపూర్ణంగా చర్చించారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తుందన్నారు. ప్రతి స్థాయిలో రైతుకు సంపూర్ణ సహకారం అందించే దిశగా పని చేస్తుందన్నారు. 71 క్లస్టర్లలో రైతు వేదిక నిర్మాణ పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు పంట రుణాలు, పంట బీమా తదితర అంశాలపై అవగాహన కల్పించే దిశగా బ్యాంకర్లతో కలిసి నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు. అకాల వర్షాలతో నేపథ్యంలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.  ప్రస్తుత వానాకాలంలో అధిక ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ఉపాధిహామీ, కాంపోస్ట్‌ షెడ్స్‌, డంప్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలపై మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రవి,  జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడారు. సమావేశంలో కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్‌, ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo