సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:18:32

అలివి వలలపై ఉక్కుపాదం

అలివి వలలపై ఉక్కుపాదం
  • ఆంధ్రాజాలర్లు పరార్‌
  • కృష్ణానది తీరం వెంట అధికారుల నిఘా
  • చిన్నంబావిలో మత్స్యకారులకు అవగాహన

కొల్లాపూర్‌, నమస్తేతెలంగాణ/చిన్నంబావి: అలివి వలలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘అలివిగాని వల’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం అదేరోజు స్పం దించగా.. ఆ మేరకు అధికారులు క్షేత్రస్థాయి లో చర్యలకు ఉపక్రమించారు. గురువారమే నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల కలెక్టర్లు జిల్లా ల అధికారులతో సమీక్ష నిర్వహించిన విష యం తెల్సిందే. రెండోరోజైన శుక్రవారం అధికారులు శ్రీశైలం నదితీరంలో పర్యటించారు. అధికారుల రాకతో ఆంధ్రా జాలర్లు పరారయ్యారు. స్థానిక మత్స్యకారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. 


కృష్ణానది తీరం వెంట గాలింపు..

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ కృష్ణానది తీరం వెంట శుక్రవారం మత్స్య, పోలీస్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మత్స్యశాఖ అధికారి రాధరోహిణి, ఫీల్డ్‌మన్‌ అంజయ్య, ఎస్సై మురళీగౌడ్‌, పోలీస్‌, రెవెన్యూ సిబ్బందితో కూడిన బృందం కొల్లాపూర్‌ మండలం నల్లమల అడవిలోని కృష్ణానదితీరం వెంట నిషేధిత అలివి వలల కోసం గాలించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న అమరిగిరి నుంచి మొదలుకొని కోతిగుండు, ఎర్రగుట్టలు, చీమలతిప్ప, మొగులొత్తు, పాతబొల్లారం, ఎర్రగుంట తీగలు, వేపలచెరువు, సోమశిల వరకు మరబోటులో గాలింపు చర్యలను చేపట్టారు. దాడులకు వస్తున్నట్టు ముందస్తుగానే చేపల మాఫియాకు సమాచారం అందడంతో అలివి వలలతో చేపలు పట్టే ఆంధ్రా జాలర్లు పరారయ్యారు. ఇదిలావుండగా కొల్లాపూర్‌ ప్రాంతంలోని మత్స్య సహకార సంఘాలతో శనివారం ఉదయం 11గంటలకు కొల్లాపూర్‌ మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి  తెలిపారు. ఈ సమావేశంలో అలివి వలల వాడకంతో జరిగే నష్టంపై వారిలో అవగాహన కల్పించనున్నారు.


వనపర్తి జిల్లా పరిధిలో..

వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో నదితీర గ్రామాల మత్స్యకారులకు నిషేధిత అలివి వలలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి ఆర్డీవో చంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడానికి కృషిచేస్తుంటే మరోవైపు కొందరు దళారులు ఆంధ్రా మత్స్యకారులతో కుమ్మక్కై కృష్ణానదిలో నిషేధిత అలివి వలలతో చేపల వేట కొనసాగిస్తూ స్థానికుల పొట్టకొడుతున్నారని తెలిపారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టబోమని హెచ్చరించారు. సదరు వలలతో వేటను సాగించే వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెండు టాస్క్‌ఫొర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ కృష్ణానది తీరం వెంట రోజూ ప్రత్యేక నిఘా ఉంచి పెట్రోలింగ్‌ ఏర్పాటు చేస్తామని, చట్టవిరుద్ధంగా నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని హెచ్చరించారు.

logo