హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకాను కెనడాలోనూ ప్రవేశపెట్టనున్నట్టు భారత్ బయోటెక్ గురువారం తెలిపింది. ఇందుకోసం అమెరికాకు చెందిన ఒక్యుజెన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. అమెరికాలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తికి గతంలోనే ఒక్యుజెన్-భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం కుదిరింది. తాజాగా ఈ ఒప్పందాన్ని కెనడాకు విస్తరిస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో 45 శాతం వాటాను ఒక్యుజెన్కు ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. కెనడాలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి త్వరలో దరఖాస్తు చేయనున్నట్టు ఒక్యుజెన్ తెలిపింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచాలనేదే తమ ధ్యేయమని భారత్ బయోటెక్ చైర్మెన్ కృష్ణా ఎల్లా తెలిపారు.