బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 22, 2020 , 04:18:44

నలుదిక్కులా గ్రీన్‌చాలెంజ్‌

నలుదిక్కులా గ్రీన్‌చాలెంజ్‌
  • మొక్కలు నాటిన పలువురు ప్రముఖులు
  • ఎంపీ సంతోష్‌కుమార్‌ పేరిట నర్సరీ

హైదరాబాద్‌/జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఒక్క మొక్కతో మొదలైన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. నలుదిశలా వ్యాపి స్తున్నది. మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల ఓపెన్‌కాస్టు వద్ద ఏఎమ్మార్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. గ్రీన్‌చాలెంజ్‌కు విజయ సంకేతంగా ప్రత్యేక నర్సరీని ఏర్పాటుచేస్తామని, నర్సరీకి ఎంపీ సంతోష్‌ పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఏడాది కాలంలో దాదాపు లక్ష మొక్కలు నాటినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కేటీపీసీ చీఫ్‌ ఇంజినీర్‌ సిద్ధయ్య, తాడిచెర్ల తాసిల్దార్‌ శ్రీనివాస్‌, కొయ్యూరు ఎస్సై నరేశ్‌ పేర్లను గ్రీన్‌చాలెంజ్‌కు నామినేట్‌చేశారు.


గ్రీన్‌చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని బహుళజాతి కంపెనీలు సైతం నర్సరీలు, పార్కులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కోఫౌండర్‌, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ తెలిపారు. రాష్ట్ర మైనార్టీల కమిషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఖమ్రుద్దీన్‌, హజ్‌ కమిటీ చైర్మన్‌ మసిఉల్లా ఖాన్‌ మంగళవారం మొక్కలు నాటారు. ప్రతి పౌరుడు గ్రీన్‌ చాలెంజ్‌లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఆసరా క్లబ్‌ సోషల్‌మీడియా ద్వారా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌పై ప్రత్యేక ప్రచారం మొదలు పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నట్టు ఆసరా క్లబ్‌ ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీత్రీ కార్యాలయ ఆవరణలో సంస్థ జనరల్‌ మేనేజర్‌ సూర్యనారాయణ  సిబ్బందితో కలిసి మొక్కలు నాటా రు. అనంతరం మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సవాల్‌ విసిరారు.logo