ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:21

తగ్గుతున్న వైరస్‌

తగ్గుతున్న వైరస్‌

  • కరోనా వ్యాప్తి రేటు 1.9 నుంచి 0.5కు చేరిక
  • నిజమవుతున్న ప్రభుత్వ అంచనాలు.. ప్రైవేటుకెళ్లి అప్పుల పాలు కావొద్దు
  • వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు శ్రీనివాస్‌రావు, రమేశ్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సెప్టెంబర్‌లో వైరస్‌వ్యాప్తి మందగించిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌రావు చెప్పారు. అందుకే అతితక్కువ కేసులు నమోదవుతున్నాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. కరోనాపై ప్రభుత్వ అంచనా లు నిజమవుతున్నాయని చెప్పారు. ఒకేసారి తగ్గకుండా, క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి విషయమన్నారు. కరోనా వ్యాప్తి రేటు (ఒకరి నుంచి మరొకరికి) జూలైలో 1.9గా ఉంటే, ఇప్పుడు కేవలం 0.5 శాతమే ఉన్నదని పేర్కొన్నారు. జూన్‌లో కరోనా పాజిటివ్‌ రేటు అత్యధికంగా ఉండగా, ఇప్పుడు 4 శాతానికి తగ్గిందని తెలిపారు. మంగళవారం  వైద్యావిద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందికిగాను 79 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని వెల్లడించిన ఆయన.. పరీక్షల్లో ఢిల్లీ, అసోం తర్వాత మనది మూడోస్థానంలో ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో సగటున రోజుకు 55 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 15.42 శాతమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. 

ఖాళీగా 75 శాతం పడకలు

ప్రభుత్వ దవాఖానలతోపాటు 230 ప్రైవేటు దవాఖానల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని శ్రీనివాస్‌రావు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో 75 శాతం పడకలు, ప్రైవేటులో 65 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు దవాఖానల్లో ఎక్కువగా ఇతర రాష్ర్టాలనుంచి వచ్చినవారు చికిత్స పొందుతున్నట్టు గుర్తించామని తెలిపారు. మహబూబాబాద్‌, నల్లగొండ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, వారం పదిరోజుల్లో తగ్గుముఖం పడుతుందనిఅంచనా వేస్తున్నామన్నారు. వెంటిలేటర్‌ బెడ్స్‌ అందుబాటులో లే వం టూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, పడకలు, వెంటిలేటర్లు సరిపోయినన్ని ఉన్నాయని డీఎంఈ రమేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. గతంలో 1,665 పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సరఫరా ఉంటే, ఇప్పుడు 7,772 పడకలకు సౌకర్యం కల్పించామని చెప్పారు. భవిష్యత్‌లో ప్రభుత్వ దవాఖానల్లోని అన్ని పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. కొత్తగా 6 దవాఖానల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. logo