శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 02:15:16

చరిత్రలో నిలిచే ధరణి

చరిత్రలో నిలిచే ధరణి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌ రూపకల్పన గొప్ప విషయమని ఎన్నారై టీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల కొనియాడారు. ప్రజా కోణంలో పోర్టల్‌ను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో దేశాలు తిరిగానని, కానీ భూములకు సంబంధించి ఇలాంటి సులభతర విధానాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఎన్నారై ప్రతినిధిగా ధరణి ప్రారంభోత్సవానికి హాజరయినట్టు ఆయన తెలిపారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎన్నారైలు, వారి కుటుంబసభ్యుల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు.

కోర్‌ బ్యాంకింగ్‌ లాగా.. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తికావటం అనేది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. ధరణితో ఒక్క క్లిక్‌తో సమాచారం తెలుసుకోవచ్చని, ఇది సామాన్యుడికి ఎంతో సాంత్వన చేకూర్చే విషయమని చెప్పారు. భూ రికార్డులన్నీ ఒకే పోర్టల్‌లో నిక్షిప్తం చేయడం మంచి ఆలోచనని అభినందించారు. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అవినీతిని అరికట్టడానికి ధరణి ఒక బ్రహ్మాస్త్రమని అభివర్ణించారు. ఎన్నారైలకు భూములపై ఉన్న భయాలకు చెక్‌ పడిందని పేర్కొన్నారు. రెవెన్యూ సేవలు సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తెచ్చారని మహేశ్‌ బిగాల కొనియాడారు. ఎన్నారై ఆస్తులకు సంబంధించి సమస్యలు చెప్పగానే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 

తాజావార్తలు