శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 02:11:43

ధరణిలో ఎన్నారై పోర్టల్‌

ధరణిలో ఎన్నారై పోర్టల్‌

 • ప్రవాసుల భూముల రక్షణకు ఆప్షన్‌
 • ఆధార్‌కు బదులు పాస్‌పోర్ట్‌ నంబర్‌ లింక్‌ 
 • ఆచరణలోకి సీఎం కేసీఆర్‌ హామీ

హైదరాబాద్‌, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూములున్న ఎన్నారైలకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వారి భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకొనేందుకు సదుపాయం కల్పించింది. ‘ఎన్నారై పోర్టల్‌' పేరుతో ప్రత్యేక ఆప్షన్‌ శనివారం నుంచి అందుబాటులో కి వచ్చింది. ధరణిలో స్లాట్‌ రీషెడ్యూల్‌కు కూడా ఆప్షన్‌ ఇచ్చింది. ‘తెలంగాణలో భూములున్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఎన్నారైలకు ఆధార్‌ కార్డుకు బదులు పాస్‌పోర్ట్‌ లేదా ఇంకేదైనా గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకొని ధరణి పోర్టల్‌లో భూవివరాలు ఎక్కించాలని ఆలోచిస్తున్నాం’ గత ఏడాది నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా మండలిలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలివి. ఈ హామీ ఆచరణలోకి వచ్చిం ది. మరోవైపు, ధరణిలో స్లాట్‌ను మూడు సార్లు రీషెడ్యూల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. తొలి సారి ఉచితంగా చేస్తారు. రెండోసారి రూ.500, మూడోసారి రూ.1000 చార్జి చేస్తారు. 

ధరణిలో ఎన్నారై పోర్టల్‌ వినియోగం ఇలా..

 • ఎన్నారైలు ముందుగా పోర్టల్‌లో ‘సైన్‌ అప్‌' ఆప్షన్‌ను ఎంచుకొని ఫోన్‌ నంబర్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
 • పేరు ఎంటర్‌ చేయగానే.. నివసిస్తున్న దేశాన్ని ఎంచుకొని ఫోన్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
 • ఎన్నారై పోర్టల్‌లో లాగిన్‌ కావాలి. 
 • ముందుగా ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. పాస్‌పోర్ట్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి.  
 • తర్వాత రాష్ట్రంలో సొంత భూమి ఎక్కడున్నదో, ఎంత ఉన్నదో వివరిస్తూ, ఖాతా నంబర్‌, సర్వే నంబర్‌ తదితర వివరాలు నమోదు చేయాలి. డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి.
 • దరఖాస్తు కలెక్టర్‌ వద్దకు వెళ్తుంది. కలెక్టర్‌ క్షేత్రస్థాయి వివరాలను సేకరించి పరిశీలించాక దరఖాస్తుకు అనుమతించడమో తిర్కరించడమో చేస్తారు.  
 • అనుమతిస్తే దరఖాస్తు తాసిల్దార్‌కు వెళ్తుంది. ఆయన డిజిటల్‌ సంతకం చేయాలి. 
 • పట్టాదార్‌ పాస్‌బుక్‌ మంజూరవుతుంది. ఎస్‌ఎంఎస్‌ లింక్‌, ఈ- మెయిల్‌ ద్వారా ఈ- పాస్‌బుక్‌ను పంపిస్తారు.

VIDEOS

logo