శనివారం 06 జూన్ 2020
Telangana - May 08, 2020 , 01:48:16

వినియోగదారులపైనే భారం

వినియోగదారులపైనే భారం

  • విద్యుత్‌ సవరణ బిల్లుతో నష్టపోయేది వారే
  • కేంద్రం చేతుల్లోకి సరఫరా, పంపిణీ వ్యవస్థలు
  • సబ్సిడీ, ఉచిత విద్యుత్‌కు ఆటంకాలు ఏర్పడుతాయి
  • ‘నమస్తే తెలంగాణ’తో ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం-2020 బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాలవారికి ఇస్తున్న సబ్సిడీలు రద్దయ్యే అవకాశం ఉన్నదని, అంతిమంగా వినియోగదారులపైనే భారం పడుతుందని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు చెప్పారు. డిస్కమ్‌లు ప్రైవేటుపరం అవుతాయని, క్రాస్‌ సబ్సిడీలు తగ్గిపోతాయని తెలిపారు. కేంద్రీకృ త విద్యుత్‌ విధానం వల్ల రాష్ర్టాలకు ఏమాత్రం అధికారం ఉండదన్నారు.  కేంద్రం రూపొందించిన విద్యుత్‌ ముసాయిదా బిల్లుపై నెలకొన్న అనుమానాలు, అది అమలైతే జరిగే పరిణామాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

విద్యుత్‌ సవరణ బిల్లులోని ఆంతర్యం, దాని పర్యవసానాలు ఏమిటి?

విద్యుత్‌ సవరణ చట్టం-2020 బిల్లు వల్ల విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ (జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌).. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుత విద్యుత్‌ వ్యవస్థ అంతా రాష్ర్టాల నుంచి కేంద్ర ప్రభుత్వ అధీకృత వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రజాసంక్షేమంలో భాగంగా వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు లేదా ఉచిత విద్యుత్‌ వంటి వాటికి ఆటంకాలు ఏర్పడుతాయి. డిస్కమ్‌లు మరింత నష్టాల ఊబిలోకి వెళ్లిపోతాయి. కరెంట్‌ వినియోగం, నియంత్రణ అంతా కేం ద్రం చేతుల్లోకి వెళ్లడం వల్ల విద్యుత్‌ ఆధారిత వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. యూనిట్‌ ధరను సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్ణయిస్తుంది. దీంతో రాష్ట్ర పరిధిలోని రెగ్యులేటరీ అథారిటీ నిర్వీర్యమవుతుంది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. చెల్లింపుల్లో ఆలస్యమైతే ప్రతి యూనిట్‌కు అధికమొత్తంలో అపరాధ రుసుం చెల్లించాలి అనే నిబంధన కూడా సవరణ బిల్లులో చేర్చారు. దీనివల్ల డిస్కంలు, అంతిమంగా వినియోగదారుడిపై భారం పడుతుంది. 

లైసెన్సింగ్‌ విధానంద్వారా విద్యుత్‌రంగాన్ని పూర్తిగా ప్రైవేట్‌పరం చేయడంలో భాగమే చట్ట సవరణ అన్న వాదన వినిపిస్తున్నది. నిజమేనా? 

పవర్‌ లైసెన్సింగ్‌ విధానం ఇప్పటిదాకా రాష్ర్టాల పరిధిలో ఉన్నది. డిమాండ్‌కు అనుగుణంగా వెసులుబాటును బట్టి కొనుగోలుచేసుకొనే అవకాశం రాష్ర్టానికి ఉన్నది. కానీ కొత్త చట్టం వల్ల అది ఉండదు. ఎవరు ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేయవచ్చు. ఉదాహరణకు మన పక్క రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కొనడం ద్వారా ట్రాన్సిమిషన్‌ భారం తగ్గుతుంది. అది కాకుండా సుదూర రాష్ట్రం నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశిస్తే ట్రాన్స్‌మిషన్‌ వ్యయం పెరుగుతుంది. ఆ భారాన్ని డిస్కమ్‌లు అంతిమంగా వినియోగదారుల నుంచే రాబట్టాల్సి వస్తుంది. లైసెన్సింగ్‌ విధానం కేంద్రం పరిధిలోకి వెళ్లడం ద్వారా డిస్కమ్‌ల పాత్ర నామమాత్రంగా మారిపోతుంది.

కాలుష్య నియంత్రణకే ఈ మార్పులు అంటున్నారు.. నిజమేనా?

గ్యాస్‌, బొగ్గు ఆధారిత విద్యత్‌ వల్ల కాలుష్య సమస్య ఎదురవుతున్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు సౌర, పవన, బయో, జల విద్యుత్‌ ఉత్పత్తిపై రాష్ర్టాలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఉత్తర భారతదేశంలో జల విద్యుత్‌ ఎక్కువగా అందుబాటులో ఉన్నది. అక్కడి నుం చి దక్షిణాదికి సరఫరా చేయాలనే ఆలోచన ఉందేమో అంటున్నారు. అదే నిజమైతే ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు భారీగా ఉండే అవకాశమున్నది. నిజానికి ఇప్పుడున్న పద్ధతినే కొనసాగిస్తే సరిపోతుంది. విద్యుత్‌ అంశం కేంద్ర పరిధిలోకి వెల్లడం వల్ల్ల రాష్ర్టాల ప్రయోజనాలు నెరవేరే అవకాశం చాలా తక్కువ. రాష్ర్టాల ప్రమేయమే లేనప్పుడు ఆపరేషన్స్‌ ఎలా అన్నది సంశయంగా తయారైంది.  తమ వనరులు, ప్రయోజనాలు, ప్రజల, సంస్థల స్థితిగతులు అన్నింటినీ బేరీజు వేసుకొనే అవకాశం రాష్ర్టానికే ఉంటుంది. 

దేశంలోని ఇతర రాష్ర్టాల వ్యవసాయరంగానికి మన రాష్ట్ర వ్యవసాయ విద్యుత్‌ ఆధారిత పరిస్థితిని వివరిస్తారా?

తమిళనాడు, ఏపీలో 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. పంజా బ్‌,  కర్ణాటకలో ఆరు గంటలు ఇస్తున్నా ఏకబిగిన ఇవ్వడం లేదు. కానీ మన రాష్ట్రంలో మాత్రం నాణ్యమైన కరెంట్‌ను, 24 గంటలూ ఉచితంగా అందిస్తున్నాం. కర్ణాటకలో 29 లక్షల కనెక్షన్లు, పంజాబ్‌లో 13.78 లక్షలు, ఏపీలో 19 లక్షలు ఉండగా తెలంగాణలో 24.4 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న రాష్ర్టాల్లో మీటర్లు దాదాపుగా ఎక్కడా లేవు. మన దగ్గర అసలే లేవు. కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు మీటర్లు బిగించాలి. ఇందుకు ప్రామాణిక పద్ధతులు పాటించాలి. మీటరు కోసం షెడ్‌ వేయాలి. ఎర్తింగ్‌ చూసుకోవాలి. రైతులకు సబ్సిడీ ఎలా ఇస్తారన్నది తేలాల్సి ఉన్నది. ఏదిఏమైనా దేశవ్యాప్తంగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతిమంగా విద్యుత్‌ వినియోగదారునికి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక భారం వారు మోయాల్సిందేనన్నది ఈ ముసాయిదా బిల్లును చూసిన తర్వాత అర్థమవుతున్నది.

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడం ద్వారా ఎటువంటి సమస్యలు వస్తాయి? 

వ్యవసాయ మీటర్లు బిగించడం అంటే సాహసంతో కూడుకున్న పని. మన రాష్ట్రంలో ఏ ఒక్క కనెక్షన్‌కు మీటరు లేదు. రేపు కచ్చితంగా మీటర్‌ పెట్టాలంటే ఇందాక చెప్పినట్టు స్టాండర్డ్‌ పద్ధతులు అనుసరించాలి. నెలనెలా రీడింగ్‌ చూడాలి. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్న పని. మ్యాన్‌పవర్‌, మిషన్‌పవర్‌ సమకూర్చుకోవడం, మెయింటేన్‌ చేయడం డిస్కింలకు భారమవుతుంది. ఇది ఒకసారి చేసి వదిలిపెట్టే విషయం కాదు. నెలనెలా మీటర్‌ రీడింగ్‌ (ఇప్పుడు వ్యవసాయేతర రంగాల్లో చేయడం లేదా అంటే అవి వేరు) చూడాలి. బిల్‌ జనరేట్‌ చేయాలి. ఆ బిల్లుల్ని వసూలు చేయాలి. ఇప్పటిదాకా సబ్సిడీ పొందిన రైతు బిల్లు చెల్లిస్తాడా? నేరుగా బిల్లులు చెల్లించడం సాధ్యమయ్యే పనేనా అన్నది కొత్త సవాల్‌.

వ్యవసాయానికి మన రాష్ట్రం 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది. ఒకవేళ కొత్తచట్టం అమల్లోకి వస్తే రద్దవుతుందా?

విద్యుత్‌ సవరణ బిల్లుపై అనేక రాష్ర్టాలు ఇప్పటికే తమ వ్యతిరేకతను వ్యక్తంచేశాయి. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ విషయంలో వెనుకడుగు వేయబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. రికార్డుస్థాయిలో దిగుబడులు సాధించడానికి రైతులకిస్తున్న ఉచిత విద్యుత్‌ కూడా కారణమే. అందువల్ల కేంద్ర చట్టాన్ని తాము వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేశవ్యాప్త పరిస్థితులను బట్టి రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ లేదా సబ్సిడీ ఆధారపడి ఉంటుంది. 

రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు, రంగాలకు ఇస్తున్న సబ్సిడీలు కొనసాగుతాయా?  

ప్రస్తుతం స్టేట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ పరిధిలో నిర్ణయాలు జరుగుతున్నాయి. సబ్సిడీలు, క్రాస్‌ సబ్సిడీలు ఇస్తున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, గృహ వినియోగ విద్యుత్‌ మీద రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌ ధరపై సబ్సిడీ నిర్ణయిస్తున్నది. ఇప్పు డు ఆ అధికారం స్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ నుం చి సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ పరిధిలోకి వెళ్తుం ది. ఇప్పటివరకూ రాష్ర్టాలు తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఒక్కో రంగానికి వేర్వేరుగా ఇచ్చే సబ్సిడీని డిస్కమ్‌లకు చెల్లిస్తున్నాయి. కొత్త చట్టం లో ఆ అవకాశం రాష్ట్ర పరిధిలో ఉండదు. దేశమంతటా యూనిట్‌ ధర ఒకటే ఉంటుంది. అంతిమంగా వినియోగదారులే నష్టపోతారు. ఇక సబ్సిడీలు కొనసాగుతాయా? లేదా? అన్న విషయంలో మరింత స్పష్టత రావాల్సిఉన్నది. చట్టాన్ని పరిశీలిస్తే సబ్సిడీలు కొనసాగే అవకాశం ఉన్నది. కానీ బిల్లు మొత్తాన్ని వినియోగదారుడు ముందుగా చెల్లిస్తే, ఆ తర్వాత సబ్సిడీని అతడికి అందివ్వవచ్చు. వంటగ్యాస్‌ సబ్సిడీని బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తున్నట్టే చేయవచ్చు.

  వినియోగదారులపైనే భారం!

 విద్యుత్‌ సవరణ చట్టం బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాలవారికి ఇస్తున్న సబ్సిడీలు రద్దయ్యే అవకాశం ఉన్నది. అంతిమంగా వినియోగదారులపైనే భారం పడుతుంది. డిస్కమ్‌లు ప్రైవేటుపరం అవుతాయి. క్రాస్‌ సబ్సిడీలు తగ్గిపోతాయి.


logo