బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:24

నిరుపయోగ భూములు వాపస్‌

నిరుపయోగ భూములు వాపస్‌

  • స్థలాలు పొంది పనులు ప్రారంభించని పరిశ్రమలకు నోటీసులు: అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరిశ్రమల కోసం కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూములను వాపస్‌ తీసుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ర్టానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. మంగళవారం టీ ఫైబర్‌ కార్యాలయంలో పరిశ్రమలశాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కంపెనీలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని, నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలకు వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని సూచించారు. 

నిరుపయోగ భూములను వెనుకకు తీసుకోవాలని ఆదేశించారు. చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ పేరుతో మార్పిడిచేసుకున్న వాటిపైకూడా కేటీఆర్‌ సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకేచోట చేర్చాలని, ఇందుకోసం బ్లూ బుక్‌ను తయారుచేయాలని సూచించారు. ఇందులో అన్ని పరిశ్రమల సమగ్ర సమాచారం ఉండాలని ఆదేశించారు. ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వారివివరాలు, పరిశ్రమల క్యాటగిరీతోపాటు ఆయా కంపెనీల పూర్తి వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వద్ద కంపెనీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 

ఈ-ఎస్‌ఎఫ్‌సీ ఆవిష్కరణ

తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌సీ)కు సంబంధించిన ఈ-ఎస్‌ఎఫ్‌సీ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. టీఎస్‌ఎఫ్‌సీ కార్యకలాపాలపైన సమీక్ష నిర్వహించిన కేటీఆర్‌.. ఎస్‌ఎఫ్‌సీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అన్ని సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఎస్‌ఎఫ్‌సీ విభజన అంశంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ మాణిక్‌రాజ్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo