ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 25, 2020 , 01:15:12

రెడ్‌ నోటీస్‌.. ఇంటికి రావొద్దు ప్లీజ్‌

రెడ్‌ నోటీస్‌.. ఇంటికి రావొద్దు ప్లీజ్‌

-కరోనా అనుమానితుల ఇండ్లకు నోటీసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాలనుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్నవారి కుటుంబాలకు మంగళవారం నుంచి రెడ్‌ నోటీసులను జారీచేస్తున్నది. కుటుంబసభ్యుల అనుమతితో ‘మా ఇంటికి రావొద్దు.. మా దగ్గరికి రావొద్దు’ అని రాసిఉన్న నోటీసులను ఇండ్లకు అంటిస్తున్నది. వ్యాప్తి కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల బృందాలు రాత్రి పగలు పనిచేస్తున్నాయి. ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారికి ఇప్పటికే క్వారంటైన్‌ ముద్రలువేశాయి. వాస్తవానికి 20 రోజుల కిందట విదేశాల నుంచి వచ్చినవారిలో చాలామంది తమ వివరాలను వెల్లడించలేదు. ఇందులో ఇటలీ, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్‌ నుంచి వచ్చినవారు వేలసంఖ్యలో ఉన్నారు. కొందరు బాధ్యతాయుతంగా అధికారులకు సమాచారమిచ్చినా.. చాలామంది తమకు విమానాశ్రయాల్లో నిర్వహించిన థర్మల్‌ స్క్రీనింగ్‌లో ఏమీ తేలలేదని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. 14 రోజుల తర్వాత ఒక్కొక్కరికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడుతుండటంతో అధికార బృందాలు డేగ కన్నుతో నిఘావేశాయి. 


logo