గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 19:44:34

విదేశీ మక్కలు కొంటె.. మన మక్కలు మోరి పాలె : మంత్రి హరీశ్‌రావు

విదేశీ మక్కలు కొంటె.. మన మక్కలు మోరి పాలె : మంత్రి హరీశ్‌రావు

సిద్ధిపేట : కేంద్రం విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకుంటే తెలంగాణ రైతులు పండించిన మక్కలు మోరి పాలేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానికంగా పండించిన మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. అన్నదాతల పొట్టకొట్టేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆఫ్రికా నుంచి మక్కలు కొంటామని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం అంటోందని అలా చేస్తే ఇక్కడి రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఇక్కడి ఫౌల్టీఫాం నిర్వాహకులు ఇతర రాష్ర్టాలకు వెళ్లి తక్కువ ధరకు మక్కలు కొనుగోలు చేస్తే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. యాసంగిలో క్వింటాకు రూ.1700 నుంచి 1800 చెల్లించి తెలంగాణ ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేసిందని, వానాకాలంలోనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. రైతుబీమా, రైతుబంధు, సాగుకు నిరంతర ఉచిత విద్యుత్‌, సబ్సిడీపై యంత్ర పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందించి అన్నదాతలకు సీఎం కేసీఆర్‌ అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo