శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 21, 2020 , 02:52:31

పారిశ్రామిక కారిడార్లకు ఏదీ మద్దతు?

పారిశ్రామిక కారిడార్లకు ఏదీ మద్దతు?
  • 16 జిల్లాల్లో లక్షలమందికి ఉపాధి
  • రెండు కారిడార్లకోసం రూ.69 వేల కోట్ల అంచనాలతో సమగ్ర ప్రణాళిక
  • పారిశ్రామిక కారిడార్లకు ఏదీ మద్దతు?
  • కొత్త రాష్ట్రమైనా ఊతమివ్వని కేంద్రప్రభుత్వం
  • రహదారి పారిశ్రామికవాడలకోసం రాష్ట్ర విజ్ఞప్తులు బుట్టదాఖలు
  • పలుమార్లు కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖలు
  • కేంద్ర మంత్రులు, అధికారులకు విజ్ఞప్తులు చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే వివిధ రంగాల్లో సమాంతరంగా పురోగమించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంటే.. ఆ రాష్ర్టానికి అన్నివిధాల చేయూతనివ్వడం సమాఖ్య వ్యవస్థలో కేంద్రం విధి. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే.. అది దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకభూమిక నిర్వహిస్తుందన్నది నిర్వివాదం. కానీ, దురదృష్టవశాత్తూ.. మనదేశంలో కేంద్ర ప్రభు త్వం.. రాష్ర్టాలను రాజకీయకోణంలో చూడటం తప్ప సమాఖ్యస్ఫూర్తిని ప్రదర్శించడంలేదు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరున్నర దశాబ్దాల వంచిత ప్రాంతాన్ని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రేయింబవళ్లు కృషిచేస్తున్నారు. ఒకవైపు పేదలకు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. మరోవైపు పారిశ్రామీకరణను ప్రోత్సహించారు. టీఎస్‌ఐపాస్‌ పేరుతో తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం యావత్‌దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. 


రహదారి పారిశ్రామికవాడలను అభివృద్ధిచేయడంద్వారా తెలంగాణ ఉద్యమ ప్రధాన లక్ష్యాలలో ఒకటైన ఉపాధికల్పనను పెద్ద ఎత్తున కల్పించవచ్చని మౌలిక సదుపాయాలను కల్పించవచ్చని సంకల్పించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ - వరంగల్‌ (హెచ్‌డబ్ల్యూఐసీ), హైదరాబాద్‌  నాగపూర్‌ (హెచ్‌ఎన్‌ఐసీ), హైదరాబాద్‌  బెంగళూరు (హెచ్‌బీఐసీ) రహదారి పారిశ్రామిక కారిడార్లను మంజూరుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గత ఐదేండ్లలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధానమంత్రిని అనేకమార్లు కలిసి ఈ విషయమై సానుకూలంగా స్పందించాలని లిఖితపూర్వకంగా కోరారు. 


కానీ.. ఈ పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి   ఎలాంటి మద్దతు లభించలేదు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా వేగంగా అనుమతుల ప్రక్రియను పూర్తిచేయడంకోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. మిషన్‌ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీటిసౌకర్యం కల్పించారు. మౌలిక సదుపాయాలను కల్పించడంకోసం టీఎస్‌ఐఐసీకి అవసరమైన నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు రాష్ట్రంలో పారిశ్రామీకరణకు అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. 


సీఎం సంకల్పానికి అనుగుణంగా రహదారి పారిశ్రామికవాడలను సాధించడానికి చాలాసార్లు కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చివచ్చారు. కానీ కేంద్రం నుంచి ఒక్కటంటే ఒక్క సానుకూల సంకేతం రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సాయమందించాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. గత ఐదేండ్లుగా పారిశ్రామిక కారిడార్ల గురించి ఎన్ని విజ్ఞప్తులు చేసినా మంజూరుచేయలేదు. ఫార్మాసిటీ, జహీరాబాద్‌, వరంగల్‌ టెక్స్‌టైల్‌పార్క్‌ లాంటివాటికి నిధులు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. కేంద్రం నుంచి రాజ్యాంగబద్ధంగా వచ్చిన నిధులే తప్ప ఒక్క పైసా కూడా అదనంగా మంజూరుచేయకుండా తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నది. 


రూ.69 వేల కోట్లతో రెండు కారిడార్లు

హెచ్‌డబ్ల్యూఐసీ, హెచ్‌ఎన్‌ఐసీలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండు కారిడార్లకు కలిపి మొత్తం అంచనావ్యయం రూ.69,083 కోట్లు కాగా (వరంగల్‌ కారిడార్‌ రూ.38,175 కోట్లు, నాగపూర్‌ కారిడార్‌ రూ.30,908 కోట్లు), ఇందులో దాదాపుగా 25 శాతం నిధులు (రూ.17,229 కోట్లు)  కేటాయించాల్సి ఉన్నది. మిగిలిన మొత్తం రూ.51,854 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చుచేస్తుంది. ఐదున్నరేండ్లపాటు వినతులు ఇచ్చిన తర్వాత నిరుడు అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం చర్చించింది. ఈ ఏడాది జనవరి 7న ఢిల్లీ  ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (డీఎంఐసీడీసీ) ఎండీ, సీఈవోలతో రాష్ట్ర అధికారులు సమావేశమయ్యారు. 


ఈ సమావేశంలో వచ్చిన సూచనల ఆధారంగా సవరించిన ప్రతిపాదనలను డీఎంఐసీడీసీకి పంపించారు. ఈ సంస్థ ఆమోదం లభించిన తర్వాత జాతీయ పారిశ్రామికవాడల అభివృద్ధి, అమలు ట్రస్ట్‌ (ఎన్‌ఐసీడీఐటీ) బోర్టు తుది ఆమోదానికి పంపిస్తారు. ఈ రెండు కారిడార్లకు ఆమోదం లభిస్తే.. రాష్ట్రంలోని 16 జిల్లాలు వీటి పరిధిలోకి రానున్నాయి. పారిశ్రామికవాడ పరిధిలోని 50 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. వరంగల్‌ కారిడార్‌లో మొత్తం 11 పారిశ్రామిక పార్కులు రానుండగా.. నాగపూర్‌ కారిడార్‌లో 20 వాడలు రానున్నాయి. ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, జహీరాబాద్‌ నిమ్జ్‌ వంటి పలు పార్కులు ఇందులో భాగంకానున్నాయి. 


లక్షల మందికి ఉపాధి అవకాశాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లు కార్యరూపం దాలిస్తే.. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయి. లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కారిడార్లు ఉన్న ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. ముడిసరుకులు, ఉత్పత్తులకోసం రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. దేశవ్యాప్తంగా రవాణా అనుసంధానమవుతుంది. జాతీయ రహదారులను ఆనుకొనే పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేస్తారు. ఒకవేళ జాతీయ రహదారికి దూరంగా ఏర్పాటుచేయాల్సి వస్తే.. పారిశ్రామిక పార్క్‌ నుంచి జాతీయ రహదారి వరకు సౌకర్యవంతంగా రోడ్డును నిర్మిస్తారు. ముడిసరుకుల దిగుమతి.. ఉత్పత్తుల ఎగుమతికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటుచేస్తారు. హైదరాబాద్‌  బెంగళూరు పారిశ్రామికవాడ కోసం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.


హైదరాబాద్‌ - వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌ (హెచ్‌డబ్ల్యూఐసీ ) హెచ్‌డబ్ల్యూఐసీ పరిధిలోకి రానున్న పారిశ్రామికవాడలు

1) హైదరాబాద్‌ ఫార్మా సిటీ 

2) చందన్‌వెల్లి టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ హబ్‌

3) ఫ్యాబ్‌ సిటీ (ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌) 

4) మహేశ్వరం సైన్స్‌పార్క్‌ (ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌) 

5) ఉప్పల్‌ ఐటీపార్క్‌

6) దండుమల్కాపురం పారిశ్రామిక పార్క్‌

7) భువనగిరి డ్రై పోర్ట్‌ 

8) కళ్లెం ఆగ్రో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పార్క్‌ 

9) స్టేషన్‌ ఘన్‌పూర్‌ (మల్టీ ప్రోడక్ట్‌ పార్క్‌ ) 

10) వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ 

11) కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ 


ఈ కారిడార్‌లో పరిధిలో రానున్న జిల్లాలు

1) హైదరాబాద్‌   2) రంగారెడ్డి  3) మేడ్చల్‌  

4)  యాదాద్రి   5) జనగామ   6) వరంగల్‌ రూరల్‌   

7) వరంగల్‌ అర్బన్‌ 


ఈ పారిశ్రామిక కారిడార్‌ అంచనా వ్యయం 

రూ.29,676 కోట్లు

మౌలిక సదుపాయాల కోసం అంచనా వ్యయం 

రూ.8499 కోట్లు

మొత్తం అంచనా వ్యయం 

రూ.38,175 కోట్లు 

కేంద్రం నుంచి సహాయం కోరుతున్న మొత్తం 

రూ.9,507 కోట్లు


హైదరాబాద్‌ - నాగపూర్‌ పారిశ్రామిక కారిడార్‌ (హెచ్‌ఎన్‌ఐసీ)

హెచ్‌ఎన్‌ఐసీ పరిధిలో రానున్న జిల్లాలు

1) హైదరాబాద్‌ 2) మేడ్చల్‌ 3) సంగారెడ్డి  

4) మెదక్‌ 5) సిద్దిపేట 6) కామారెడ్డి     

7) నిజామాబాద్‌ 8) నిర్మల్‌ 9) ఆదిలాబాద్‌ 


ఈ పారిశ్రామిక పార్క్‌లో పరిధిలోకి రానున్న పారిశ్రామికవాడలు

1) బౌరంపేట  (ఐటీపార్క్‌)

2) దుండిగల్‌  (ఐటీపార్క్‌)

3) జహీరాబాద్‌ నిమ్జ్‌ (మల్టీ ప్రొడక్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌) 

4) మెదక్‌ (గ్రానైట్‌, సిరామిక్‌పార్క్‌) 

5) బోనాల (బయోటెక్‌పార్క్‌) 

6) బోనాల కొండాపూర్‌ (బయోటెక్‌పార్క్‌) 

7) మక్కరాజిపేట్‌ (ఫుడ్‌ ప్రొడక్ట్స్‌పార్క్‌) 

8) యెల్దుర్తి (మాన్యుఫాక్చరింగ్‌పార్క్‌) 

9) మాసాయిపేట (మాంసం, గుడ్ల ప్రాసెసింగ్‌పార్క్‌) 

10) అచ్చంపేట- రామంతాపూర్‌ (సోలార్‌పార్క్‌) 

11) యేదులపల్లి- ఉప్పులింగాపూర్‌ (కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌పార్క్‌)

12) మిట్టపల్లి (ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇంజినీరింగ్‌ ప్రాసెసింగ్‌పార్క్‌)

13) మునిగడప (ప్లాస్టిక్‌, ఇమిటేషన్‌ జువెలరీపార్క్‌)

14) తునికి బొల్లారం (అగ్రిప్రాసెసింగ్‌పార్క్‌)

15) బండమైలారం (సీడ్‌ ప్రాసెసింగ్‌పార్క్‌)

16) జంగంపల్లి (మల్టీ ప్రొడక్ట్‌పార్క్‌)

17) మెంటరాజ్‌పల్లి (ఏరోస్పేస్‌హబ్‌) 

18) జక్రాన్‌పల్లి (ఎయిర్‌పోర్ట్‌)

19) లక్కంపల్లి (మెగా ఫుడ్‌పార్క్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పార్క్‌)

20) గుంజాల (కాంపోజిట్‌ టెక్స్‌టైల్‌హబ్‌)


పారిశ్రామిక కారిడార్‌ అంచనా వ్యయం 

రూ.28,202కోట్లు

మౌలిక సదుపాయాల అంచనా వ్యయం 

రూ. 2,706 కోట్లు 

మొత్తం అంచనా వ్యయం 

రూ. 30,908 కోట్లు

కేంద్రం నుంచి సాయం కోరింది 

రూ.7,722 కోట్లు


logo