ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:09

ఆహ్లాదంగా జాతీయ రహదారులు

ఆహ్లాదంగా జాతీయ రహదారులు

  • వచ్చే నెలాఖరునాటికి మొక్కలు నాటాలి
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనంతో జాతీయ రహదారులు ఆహ్లాదకరంగా కనిపించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జాతీయ రహదారుల పురోగతిపై అధికారులు, టోల్‌ గేట్ల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మొక్కలు నాట డం, రహదారి పనుల కొనసాగింపులో జాప్యం తదితర సమస్యలను ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జాతీయ రహదారుల పనుల్లో వేగం పెంచాలన్నారు. వచ్చే నెలాఖరు నాటికి జాతీయ రహదారులపై మొక్కలు నాటాలని, వంతెనల వద్ద అసంపూర్తిగా ఉన్న సైడ్‌ డ్రెయిన్‌లను పూర్తి చేసి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని సూచించారు. ఎన్‌హెచ్‌ఏ అధికారులు, గుత్తేదారులు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. కరోనా బాధితులను ఆదుకునే లక్ష్యంతో సీఎం సహాయనిధికి ఎస్బీ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ యాజమాన్యం రూ.5 లక్షల విరాళం చెక్కును మంత్రి హరీశ్‌రావుకు అందజేసింది. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తయారు చేసిన మందులను ఎంపీ బీబీ పాటిల్‌ సొంత నిధులతో కొనుగోలు చేసి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆ కిట్లను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo