ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 00:18:10

ముక్కు ముద్రలతో పక్కాగా లెక్క

ముక్కు ముద్రలతో పక్కాగా లెక్క

  • డిజిటల్‌ టెక్నాలజీతో పశుగణన 
  • ఇయర్‌ ట్యాగింగ్‌తో పోలిస్తే ఎంతో మేలు 
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/కంటోన్మెంట్‌ : ముక్కుముద్రల ద్వారా డిజిటల్‌ టెక్నాలజీ సహాయంతో పశుగణన పక్కాగా చేపట్టవచ్చని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. జంతువుల చెవికి బిళ్లలు (ఇయర్‌ ట్యాగ్‌) వేయడం కన్నా ఇది ఎంతో శ్రేయస్కరమన్నారు. ఆదివారం మల్కాజ్‌గిరి లోక్‌సభ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, జియో స్టాట్‌ ఇన్ఫర్మేటిక్‌ సంస్థ ఎండీ వివేక్‌రెడ్డి వినోద్‌కుమార్‌ను ఆయన అధికార నివాసంలో కలిశారు. ముక్కు ముద్రల ద్వారా జీవాల సమాచారం సేకరణ విధానాన్ని ఆయనకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. మనుషుల వేలిముద్రలు ఏ విధంగానైతే ఒకేతీరుగా ఉండవో, జీవాల ముక్కు ముద్రలు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకున్నట్టే గొర్రెలు, ఇతర జీవాల ముక్కును ఫొటో తీసి డిజటలైజ్‌ చేయడం ద్వారా పశువుల పక్కా సమాచారం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వం చేపడుతున్న గొర్రెల పంపిణీ, బ్యాంకుల నుంచి సబ్సిడీ కింద పొందిన జీవాలు పక్కా దారిపట్టకుండా చూడవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విధానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇతర యూరోపియన్‌ దేశాలకు చెందిన బీమా సంస్థలు అమలుచేస్తున్నాయని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయనహామీ ఇచ్చారు. logo