ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:08:40

కాంగ్రెస్‌, బీజేపీలో ఆగని లొల్లి

కాంగ్రెస్‌, బీజేపీలో ఆగని లొల్లి

  • కొనసాగుతున్న దాడులు, విధ్వంసాలు
  • పార్టీ పెద్దల తీరుపై నిరసనలు  

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ పెద్దల తీరుపై ఇరుపార్టీల్లో  అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. నామినేషన్ల దాఖలు, పరిశీలన  ముగిసినప్పటికీ బీ ఫారమ్‌ల పంపిణీ పూర్తి చేసే పరిస్థితి ఈ పార్టీల్లో కనిపించడం లేదు. టికెట్‌ ఆశించి భంగపడిన  ఆశావహలు రోడెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలపై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తున్నారు. అగ్రనేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి వారి కోపాన్ని  వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శనివారం బీజేపీ టికెట్‌ ఆశించిన గాజులరామారం, చింతల్‌, సుభాష్‌నగర్‌ డివిజన్లకు చెందిన కార్యకర్తలు షాపూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఉప్పల్‌, మల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్జి రాగిడి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ ఉప్పల్‌, మల్లాపూర్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, రాంనగర్‌, శేర్‌లింగంపల్లి డివిజన్లలో కాంగ్రెస్‌ ఆశావహులు ఆందోళనకు దిగారు. రాంగోపాల్‌పేట నుంచి టికెట్‌ ఆశించిన మనోజ్‌.. మర్రి శశిధర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశాడు. టికెట్లు అమ్ముకుని అన్యాయం చేశారంటూ ముషీరాబాద్‌, ఉప్పల్‌ డివిజన్లకు చెందిన బీజేపీ నాయకులు ఆత్మహత్యాయత్నం చేశారు. జాంబాగ్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ సీటు వివాదం కొనసాగుతున్నది. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా జాంబాగ్‌లో బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. అంబర్‌పేట, కాచిగూడ, రాంనగర్‌, భోలక్‌పూర్‌లో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బీ ఫారాలు ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.