మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 01:54:29

రోజు విడిచి రోజు తరగతులపై యోచన

రోజు విడిచి రోజు తరగతులపై యోచన

  • త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం
  • 25లోగా విద్యాసంస్థల తనిఖీలు
  • కొవిడ్‌ మార్గదర్శకాల పరిశీలనకు నోడల్‌ అధికారులు: మంత్రి సబిత
  • మేజర్లయితే స్వీయ సమ్మతి చాలు

విద్యార్థుల్లో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. వారిని ప్రతిరోజు పట్టణాల్లో ఉన్న కాలేజీలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల షిఫ్ట్‌ పద్ధతిలో నడపడం అంత శ్రేయస్కరం కాదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 

హైదరాబాద్‌, జనవరి 18 (నమస్తే తెలంగాణ): జూనియర్‌ కాలేజీల పునఃప్రారంభం అనంతరం షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకోబోతున్నట్టు తెలిసింది. ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు వేర్వేరుగా రెండు షిఫ్టుల్లో తరగతులు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. దీనికి బదులుగా ఒకరోజు ఫస్టియర్‌, మరోరోజు సెకండియర్‌ వారికి తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. షిఫ్ట్‌ సిస్టమ్‌పై ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసిన అధికారులు విద్యార్థుల సౌకర్యార్థం నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. నాంపల్లిలోని రూసా సెంటర్‌లో సోమవారం సంక్షేమశాఖల మంత్రులతో సమావేశంలో ఇదే ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది. త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్టు ఓ అధికారి తెలిపారు.

తనిఖీలతో పునఃప్రారంభానికి సన్నద్ధం: మంత్రి సబిత

రాష్ట్రంలో విద్యాసంస్థలన్నీ ఈ నెల 25న పునఃప్రారంభం అవుతుండటంతో కొవిడ్‌ మార్గదర్శకాల అమలుతీరు పరిశీలించేందుకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రీఓపెనింగ్‌కు సన్నద్ధం చేసేలా తనిఖీలు చేపట్టాలన్నారు. సోమవారం నాంపల్లిలోని రూసా సెంటర్‌లో సహచర మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌ సహా పలుశాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలలు, కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుందని, ప్రత్యక్ష బోధనతోపాటు సమాంతరంగా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతాయని వెల్లడించారు. ఇప్పటికే 86 శాతం మంది ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారని.. తరగతులకు హాజరుకానివారిపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. శానిటైజేషన్‌ చేసేలా స్థానిక సంస్థలు, డీపీవోలకు ఆదేశించినట్టు తెలిపారు. 


విద్యార్థుల సౌలభ్యం కోసమే..

షిఫ్టులవారీగా అమలుచేయాలని భావించిన విధానంలో.. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ప్రతిరోజు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు గదుల సర్దుబాటు సమస్య తలెత్తే అవకాశముండటంతో ఇప్పుడు అధికారులు పునరాలోచనలో పడ్డారు. పైగా విద్యార్థుల్లో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం, కాలేజీలు పట్టణాల్లో ఉండటంతో విద్యార్థులను ప్రతిరోజు కాలేజీలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు. అందువల్ల షిప్ట్‌ పద్ధతిలో నడపడం అంత శ్రేయస్కరం కాదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఒక రోజు ఫస్టియర్‌ వారికి, మరో రోజు సెకండియర్‌ వారికి తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నారు. 

ప్రత్యేక శ్రద్ధ

విద్యాసంస్థలతోపాటు వసతిగృహాలు, గురుకులాలను సైతం ఫిబ్రవరి 1 నుంచే ప్రారంభిస్తుండటంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు వేశామని, ఈ నెల 25వ తేదీలోగా ప్రతి విద్యాసంస్థను తనిఖీచేసి, సన్నద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఎస్సీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జ, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సాంకేతిక, కాలేజియేట్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ వీ అనిల్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, మల్లయ్యభట్టు పాల్గొన్నారు.

డిగ్రీ విద్యార్థులకు స్వీయ సమ్మతి చాలు

డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు స్వీయ సమ్మతి (సెల్ఫ్‌ కాన్సెంట్‌) పత్రం సమర్పించి తరగతులకు హాజరయ్యే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. డిగ్రీ ఆపై తరగతులు చదివేవారంతా మేజర్లుకావడం, స్వీయ నిర్ణయం తీసుకొనే అవకాశముండటంతో క్లాసులకు హాజరయ్యే స్వేచ్ఛనువారికే వదిలేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానుండగా.. తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖకు బదులుగా విద్యార్థులే సెల్ఫ్‌ కాన్సెంట్‌ సమర్పిస్తే సరిపోతుందని యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) ఆదేశాలచ్చింది. యూజీసీ ఆదేశాలనే ఇక్కడా అమలుచేయనున్నారు.

VIDEOS

తాజావార్తలు


logo