శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 11:18:52

రాష్ర్టంలో యూరియా కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

రాష్ర్టంలో యూరియా కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఎక్క‌డా కూడా యూరియా కొర‌త లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ర్టంలో యూరియా స‌ర‌ఫ‌రాపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టం సుభిక్షంగా ఉంది. రైతులు సంతోషంగా ఉన్నారు. గ‌తేడాది నిన్న‌టి వ‌ర‌కు ఒక‌ కోటి 3 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు అయితే, ఈ ఏడాది నిన్న‌టి వ‌ర‌కు ఒక కోటి 42 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు అయింది. గ‌తేడాదితో పోల్చితే ఈ ఏడాది సాగు పెరిగింద‌న్నారు. ఈ క్ర‌మంలో 10 ల‌క్ష‌ల 50 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా ఈ వానాకాల‌నికి అలాట్‌మెంట్ ఇచ్చారు. ఇప్ప‌టికీ 9 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా వ‌చ్చింది. ల‌క్ష పైచిలుకు మెట్రిక్ ట‌న్నుల రావాల్సి ఉంది. 50 వేల మెట్రిక్ ట‌న్నుల బ‌ఫ‌ర్ స్టాక్ ఉంద‌న్నారు. యూరియా నిల్వ‌ల‌కు గోడౌన్‌లు ఖాళీగా లేవు. అన్ని గోడౌన్ల‌లో ధాన్యం నిల్వ‌లు ఉన్నాయి. కొవిడ్ కార‌ణంగా ఈ ధాన్యం నిల్వ‌లు ఎగుమ‌తి కాలేద‌న్నారు. గోడౌన్ల ల‌భ్య‌త లేని కార‌ణంగా ఏ రోజుకు ఆ రోజు యూరియాను రాష్ర్టానికి తీసుకువ‌స్తున్నామ‌ని చెప్పారు. యూరియా ఆన్‌లోడ్ అయ్యే పాయింట్ల వ‌ద్ద హ‌మాలీల కొర‌త తీవ్రంగా ఉంద‌న్నారు. కొద్ది మంది కార్మికుల‌తోనే ఆన్‌లోడ్ చేస్తున్నారు. యూరియా త‌ర‌లింపులో అనేక ఇబ్బందులు ఉన్నాయి.

డీల‌ర్ల సంఖ్య 6,944 పాయింట్స్, పీఏసీఎస్ 902 పాయింట్స్, 330 ఆగ్రో సెంట‌ర్స్, 86 హాకా సెంట‌ర్స్ ద్వారా యూరియా స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్నారు. రాష్ర్టంలో ఏ మారుమూల ప్రాంతంలోనూ యూరియా కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా ఉండేందుకు బ‌ఫ‌ర్ స్టాక్‌ను ఉంచామ‌న్నారు. ఎరువుల‌న్నీ స‌కాలంలో అందేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. యూరియా కొర‌త ఉంద‌ని చెప్పిన 6 గంట‌ల్లోపు మీకు యూరియా రాక‌పోతే అప్పుడు ప్ర‌శ్నించండి అని మంత్రి స‌భ్యుల‌కు సూచించారు. యూరియాను రెండు, మూడు రోజులు ఆల‌స్యంగా వేస్తే ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌దు అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా యూరియాను అద్భుతంగా స‌ర‌ఫ‌రా చేశామ‌ని మంత్రి తెలిపారు.


logo