శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 12, 2020 , 02:23:18

అన్నదాతలను పట్టించుకోని కేంద్రం

అన్నదాతలను పట్టించుకోని కేంద్రం

  • వ్యవసాయానికి ఉపాధిహామీని ఎందుకు అనుసంధానించరు?
  • తెలంగాణలో వ్యవసాయానికి ఏటా రూ.60వేల కోట్లు ఖర్చు  
  • వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: దేశానికి సంపద సృష్టించే రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఉపాధిహామీని వ్యవసాయంతో అనుసంధానించాలని ఎంత మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి రైతే రాజు అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టింది సీఎం కేసీఆరేనని స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్‌ జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులకు, వ్యవసాయ పరిశోధనా కేంద్రం నూతన భవనాన్ని బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఏటా రూ.60వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పా రు. కాగా, కేంద్రం నుంచి రైతులకు ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదన్నారు. వ్యవసాయంలో కూలీల కొరత  సమస్యను పరిష్కరించేందుకు ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. వ్యవసాయ రంగంలో శాస్త్రవిజ్ఞనాన్ని పెంచేందుకు నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెటింగ్‌ అనాలసిస్‌, రీసెర్చ్‌, ఇంటలిజెన్సీలతో రాబోయే కాలంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే పంటలను పరిశోధించి ఎలాంటి పంటలు సాగుచేయాలో ఏడాది ముందే కమిటీ సూచిస్తుందన్నారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. నియంత్రిత సాగుతో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.  logo