మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 15:00:16

దేశంలోని ఏ రాష్ట్రంలో ఇంత ప్రోత్సాహం లేదు : మంత్రి సింగిరెడ్డి

దేశంలోని ఏ రాష్ట్రంలో ఇంత ప్రోత్సాహం లేదు : మంత్రి సింగిరెడ్డి

కరీంనగర్‌ : దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి ఇంత ప్రోత్సాహం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయరంగానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నూతన భవనాన్ని మంత్రి నేడు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ... ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో వ్యవహరించడం లేదన్నారు. 

ప్రాజెక్టులు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, విత్తనాలు, ఎరువులపై రాష్ట్రం ప్రభుత్వం బడ్జెట్‌ నుండి దాదాపు రూ. 60 వేల కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఆకలిదప్పుల తెలంగాణ ఆరేళ్లలో సీఎం కేసీఆర్‌ ముదుచూపుతో దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. 

సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనాలయాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. 1950 నుండి కరీంనగర్‌లో వ్యవసాయ పరిశోధనా స్థానం ఉంది. పూర్తి సౌకర్యాలతో దీన్ని ఆధునీకరించడం జరిగిందన్నారు. మంచి వంగడాల దిగుబడికి ఈ పరిశోధనా స్థానం వేదికవ్వాలన్నారు. బహుళ ప్రయోజనాల వంగడాలు, ఉత్పాదకత పెంచే వాటిని శాస్త్రవేత్తలు సృష్టించాలన్నారు. రైతన్నలు ధనికులవడమే కాదు. ఈ రాష్ట్ర ఎదుగుదలకు అండగా నిలవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. 
logo