e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home Top Slides సీమ లిఫ్ట్‌కు అనుమతుల్లేవు

సీమ లిఫ్ట్‌కు అనుమతుల్లేవు

  • కేంద్రానికి రాసిన లేఖల్లో ఒప్పుకొన్న జగన్‌
  • ముందస్తు పర్యావరణ అనుమతులకు విజ్ఞప్తి
  • స్వతంత్ర సంస్థపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నం
  • ముందుగా తెలంగాణ ప్రాజెక్టుల తనిఖీపై పేచీ

హైదరాబాద్‌, జూలై 5 (నమస్తే తెలంగాణ): ‘ముందుగా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించాలని మేం ఎంత చెప్తున్నా కృష్ణా నదీ యాజమాన్యబోర్డు పట్టించుకోవడంలేదు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్టీజీ) ఉత్తర్వులు సాకుగా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రదేశాన్ని తనిఖీ చేయాలని మాపై ఒత్తిడి పెంచుతున్నది. ఇది సరైంది కాదు. అందుకే రాయలసీమ లిఫ్ట్‌కు వెంటనే ముందస్తుగా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరుతున్నా. వెంటనే అనుమతులిచ్చేలా పర్యావరణ అంచనాల కమి టీ (ఈఏసీ) ఆదేశించాలని కోరుతున్నా. వీ లైనంత త్వరగా రాయలసీమ ఎత్తపోతల పథకాన్ని పూర్తిచేసి 800 అడుగుల దిగువ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకుంటాం’. కేంద్ర పర్యావరణ, జల్‌శక్తి మంత్రులకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖల్లో పేర్కొన్న అంశాలివి. ఈ లేఖలను పరిశీలిస్తే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టేనని ఇట్టే అర్థమవుతున్నది. అనుమతుల్లేకుండానే నిర్మిస్తున్నామని పరోక్షంగా ఒప్పుకున్నట్టు స్పష్టమవుతున్నది.

కేఆర్‌ఎంబీ తటస్థంగా ఉండాలిట
నిర్వహణ మార్గదర్శకాలకు విరుద్ధంగా శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నదని, దీంతో కృష్ణా జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని ఏపీ సీఎం జగన్‌ కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సాగర్‌ పరిధిలో ఎ లాంటి సాగు అవసరాలు లేకున్నా, కేఆర్‌ఎంబీ నుంచి అనుమతి లేకున్నా విద్యుదుత్పత్తి చేస్తున్నదని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని వాడుకోవాలంటే 854 అడుగుల నీటిమట్టం ఉండాలని, కానీ, తెలంగాణ ఆ మట్టానికి నీళ్లు చేరుకోకుండా అడ్డుపడుతున్నదని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఎస్‌ఎల్‌బీసీ పథకాలద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున సు మారు 200 టీఎంసీలు వాడుకొనేలా తె లంగాణ ప్రణాళిక సిద్ధంచేసిందన్నారు. జలవిద్యుదుత్పత్తికి 4 టీఎంసీలను వాడుకుంటున్నదని వివరించారు. 800 అడుగుల దిగువ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని వాడుకొనేలా రాయలసీమ ఎత్తిపోతల త ప్పితే ఏపీకి దిక్కులేదన్నారు. కేఆర్‌ఎంబీ పదేపదే ఆర్‌ఎల్‌ఐ ప్రదేశాన్ని పరిశీలించాలని ప్రతిపాదిస్తున్నదని.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులే అడ్వాన్స్‌డ్‌ స్టేజీలో ఉన్నాయని ముందుగా వాటిని పరిశీలించాలని కోరారు. దీంతోపాటు జల విద్యుదుత్పత్తిని అడ్డుకోవాలని, కేఆర్‌ఎంబీని తటస్థంగా ఉండేలా ఆదేశించాలంటూ కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ముం దుగా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించాలని జగన్‌ కోరడం వెనుక.. సీమ లిఫ్ట్‌ను నిర్మిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించేందుకు రాకుండా అడ్డుకోవడమనేది స్పష్టమవుతున్నది. ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయనీయకుండా కేఆర్‌ఎంబీని తటస్థంగా ఉండేలా ఆదేశించమని కేంద్రమంత్రిని కోరడం విచిత్రంగా ఉన్నది.

- Advertisement -

స్వతంత్ర సంస్థపై ఒత్తిడి
స్వతంత్ర సంస్థ అంటే ఒత్తిళ్లు లేకుండా పనిచేసే సంస్థ. కానీ ఏపీ సీఎం మాత్రం సీమ ఎత్తిపోతలకు ముందస్తుగా పర్యావరణ అనుమతి ఇచ్చేలా పర్యావరణ అంచనాల కమిటీ (ఈఏసీ)ని ఆదేశించాలంటూ కేంద్రమంత్రి జవదేకర్‌కు రాసిన లేఖలో కోరడం గమనార్హం. స్వతంత్ర సంస్థను ఆదేశించడమంటే.. ఆ సంస్థపై ఒత్తిడి పెంచి.. తతమకు అనుకూలంగా, పూర్తిగా పరిశీలించకుండానే అనుమతులు ఇప్పించుకోవాలనే దురుద్దేశం కనపడుతున్నది. ఈఏసీ 17.6.2021న సమావేశమయిందని, ఆ సందర్భంగా లేవనెత్తిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని 30.6.2021న అప్‌లోడ్‌ చేశామని, 7.7.2021న మరోసారి జరిగే సమావేశంలో ముందస్తు అనుమతులిచ్చేలా ఆదేశాలు జారీచేయాలని పేర్కొనడం విడ్డూరం.

పరోక్షంగా ఒప్పుకోలు
ఏపీ సీఎం ప్రధానికి, కేంద్ర మంత్రులకు రాసిన లేఖ ద్వారా దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయా న్ని బట్టబయలుచేసినట్టయింది. ఏ ప్రాజెక్టును ఎందుకోసం నిర్మించారనేది తేటతెల్లమయింది. మోదీకి రాసిన లేఖలో శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుదుత్పత్తికి కోసమేనని ఒప్పుకోవడంతో వాస్తవాలు అందరికీ తెలిశాయి. మంత్రులకు రాసిన లేఖల ద్వారా.. ఏపీ రాయలసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు, అందుకే ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రదేశాన్ని నిపుణులు సందర్శించకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నది. స్వతంత్ర సంస్థల విధుల్లో రాజకీయంగా ఒత్తిడి తెచ్చి అక్రమంగా పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు బట్టబయలయింది. ధిక్కరణ కేసులో సీఎస్‌కు శిక్ష వేస్తామంటూ ఆగ్రహించిన ఎన్జీటీ ఆదేశాలూ అమలుకాకుండా అడ్డుకోవడం వెనుక అంతరార్థం అర్థమవుతున్నది.

ఎన్జీటీ ఉత్తర్వులు బేఖాతర్‌
చట్టబద్ధంగా తమకు సంక్రమించిన జల విద్యుదుత్పత్తి హక్కుకు, కృష్ణా జలాల్లో వాటాకు గండి కొట్టాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టిందంటూ తెలంగాణ ప్రభుత్వం.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, కేఆర్‌ఎంబీతోపాటు కేంద్రానికి ఫొటోలు, వీడియోలతోసహా ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతుల్లేకుండా సీమ లిఫ్ట్‌ పనులు చేపట్టరాదంటూ ఏపీని ఆదేశించింది. అదే సమయంలో ధిక్కరణ పిటిషన్‌ను విచారిస్తూ.. ఆర్‌ఎల్‌ఐ పనులను పరిశీలించాలని కేఆర్‌ఎంబీని ఆదేశించింది. దీనిపై అధికారయుతంగా వ్యవహరించాల్సిన కేఆర్‌ఎంబీ.. ఆర్‌ఎల్‌ఐ ప్రదేశాన్ని తనిఖీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని బతిమాలుతున్నది. కేఆర్‌ఎంబీ అచేతనస్థితిని అలుసుగా తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తమది చట్టబద్ధమైన ప్రాజెక్టు అని, ముందుగా తెలంగాణ ప్రాజెక్టులు తనిఖీ చేయాలని పేచీలు పెడుతున్నది. తమకు వెంటనే పర్యావరణ అనుమతులు ఇస్తే.. వేగంగా ఆర్‌ఎల్‌ఐ నిర్మాణం పూర్తిచేస్తామంటూ అసలు గుట్టును విప్పి చెపుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana