శనివారం 06 జూన్ 2020
Telangana - May 08, 2020 , 18:14:05

నెలరోజులుగా జిల్లాలో ఒక్క కరోనా కేసూ లేదు: శ్రీనివాస్‌గౌడ్‌

నెలరోజులుగా జిల్లాలో ఒక్క కరోనా కేసూ లేదు: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గడిచిన నెల రోజుల నుంచి ఒక్క కేసుకూడా నమోదు కాలేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. కరోనా కట్టడిలో జిల్లా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా వైరస్‌పై ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. విపత్కర సమయంలో రైతులు ఇబ్బందులు పడొద్దని, రుణమాఫీ డబ్బులను బ్యాంకులో జమ చేశామని తెలిపారు. రుణమాఫీ గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. జిల్లాలోని ప్రతి ఊర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతుబజార్లు ఏర్పాటు చేశామన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చినవారికి క్వారంటైన్‌ ముద్ర వేయాలని, వారంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. వారి వివరాలను రిజిస్టర్‌ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిఒక్కరు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని, పట్టణాలు, గ్రామాల్లో గుంపులుగా ఉండోద్దని సూచించారు. లాక్‌డౌన్‌లో సహకరించిన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో మాదిరిగానే మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలు వేయాలని సూచించారు. మున్సిపల్‌ పట్టణాల్లో 50 శాతం దుకాణాలు తెరవాలన్నారు. నారాయణపేట జిల్లాలో కూడా కఠిన చర్యలు తీసుకోవడంతోనే కరోనాను కట్టడి చేయగలిగామని వెల్లడించారు.


logo