మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 01:00:02

భయం లేదు మిత్రమా

భయం లేదు మిత్రమా

  • గాలి ద్వారా వైరస్‌ మరో ప్రాంతానికి వ్యాపించదు
  • ఇరుకు గదుల్లో ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి
  • సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తున్నట్టు ఆధారాలున్నా ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. ‘ఒక గదిలో కరోనా రోగి ఉండి వెళ్లిపోయిన కొన్ని నిమిషాల వరకు గాలిలో వైరస్‌ తేలియాడుతూ ఉంటుంది. అంతేతప్ప గాలి ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించదు’ అని ఆయన స్పష్టం చేశారు. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకంతో రక్షణ పొందవచ్చని తెలిపా రు. కొవిడ్‌-19 వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నదని, తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ప్రపం చ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఆ అంశంపై రాకేశ్‌ మిశ్రా బుధవారం స్పందించారు. వైరస్‌ వ్యాప్తిపై జరిగిన రెండు పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు ఆ ప్రకటన చేశారని చెప్పారు. ‘ఈ నివేదికల ప్రకారం కరోనా వైరస్‌ ఐదు మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న తుంపర్ల ద్వారా కూడా గాలిలోకి వ్యాప్తి చెందుతున్నది. అంటే ఒక బాధితుడు మాట్లాడినప్పుడు లేదా శ్వాసించినప్పుడు వెలువడే అతిసూక్ష్మ తుంపర్లలోనూ వైరస్‌ ఉంటున్నది. పెద్ద తుంపర్లు బరువుతో తొందరగా భూమిపై పడుతుండగా, సూక్ష్మ తుంపర్లు కొన్ని నిమిషాలపాటు గాలిలో తేలుతాయి’ అని వివరించారు. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన మాస్కులు, సామాజిక దూరం, తరుచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్‌ వినియోగం వంటి చర్యలతో వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. ఏసీ గదులు, ఎక్కువమంది ఒకే గదిలో కూర్చుండేచోట్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 


logo