శనివారం 30 మే 2020
Telangana - May 01, 2020 , 11:57:01

కార్మికుడు లేకపోతే.. అభివృద్ధి లేదు: హరీష్‌ రావు

కార్మికుడు లేకపోతే.. అభివృద్ధి లేదు: హరీష్‌ రావు

సిద్దిపేట: కార్మికుడు లేకపోతే అభివృద్ధి లేదని, పారిశుద్ధ్య కార్మికుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని ఆర్థికమంత్రి హరీష్‌ రావు అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్మిక దినోత్సవం అంకితమని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో మున్సిపల్‌ కార్మికులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వైద్యులు, పోలీసు ఎంత కష్టపడుతున్నారో.. వారికంటే ఎక్కువగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కో కార్మికుడికి రూ. ఐదు వేల అదనపు వేతనం అందిస్తున్నామని చెప్పారు. 

ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులకు హక్కులు లభించాయన్నారు. బీడీ కార్మికులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి రూ. రెండు వేల భృతి అందిస్తున్నదని వెల్లడించారు. కరోనా కాలంలో వలస కార్మికులను చూస్తే బాధ కలుగుతుందని, లక్షలాది మంది వలస కార్మికులను కేసీఆర్‌ ప్రభుత్వం ఆదుకుంటున్నదని చెప్పారు. వారికి భోజనాలు పెట్టి కడుపు నింపడంతో పాటు 12కిలోల బియ్యం, రూ.500 నగదు అందజేస్తున్నామన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించిన కార్మికులను సన్మానం చేసుకున్నాం. యాజమాన్యం ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంతే ముఖ్యమని, కార్మికులు లేకుంటే ఉత్పత్తితోపాటు అభివృద్ధి కూడా లేదని అభిఫ్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోదామని.. కార్మికుల భద్రత.. మా బాధ్యత అని చెప్పారు.   

నగరంలోని శేషాద్రి ఆసుపత్రి వారి సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికీ ఫ్లాస్కులు, ఎన్ఆర్ఐల సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్స్ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారితో సహపంక్తి అల్పాహారం చేశారు.


logo