ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 16:46:12

వనపర్తి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

వనపర్తి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

వనపర్తి : వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిస్థితి, ధాన్య కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతానికి జిల్లాలో పాజిటివ్ కేసులు లేనప్పటికీ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం నుండి ఆదేశాలు అందే వరకు ఎవరికి వారు ఇళ్లలోనే ఉండాలని ,తప్పనిసరిగా లాక్ డౌన్  పాటించాలని చెప్పారు. అధికారులు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారి కిందిస్థాయి సిబ్బంది కూడా  కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మర్కజ్ నుంచి జిల్లాకు వచ్చిన పది మంది శాంపిల్స్ పంపగా ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదని అన్ని నెగిటివ్ వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అలాగే విదేశాల నుండి 58 మంది రాగా వారిలో కూడా ఏలాంటి లక్షణాలు లేవని, వారు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా వారిని క్వారటైంన్ లోనే ఉంచామని చెప్పారు.

ఢిల్లీ నుండి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన 293 మందిని గుర్తించి, వారందరిని కూడా క్వారంటైన్  లో ఉంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కరోనా పాజిటివ్ ఉన్న ఒక వ్యక్తిని తన ఆటోలో తీసుకువెళ్లిన జిల్లాకు చెందిన వ్యక్తికి సైతం  కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితాలు వచ్చాయని అతను కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారని, మొత్తం 11 మంది ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారని వెల్లడించారు.

మండల ప్రత్యేక అధికారులు మండలాల వారీగా క్వారటైంన్ లో ఉన్న వారు ఇళ్లలోనే ఉండేలా చూడాలని, ప్రతిరోజు మెడికల్ బృందాలు వెళ్లి రోజుకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించి నివేదికలు పంపిస్తున్నారని, ప్రత్యేకాధికారుల ఈ విషయంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాకు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారు ముందుగా 1500 మందిని గుర్తించామని, అనంతరం మరో 408 మందిని గుర్తించామని, మహారాష్ట్ర నుండి ఎక్కువ మంది వచ్చారని , వారందరినీ కూడా  హోమ్ క్వారంటైన్ లో ఉండేలాగా ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రత్యేకించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు ,వైద్య ఆరోగ్య డాక్టర్లతో ఇల్లుఇల్లు తిరిగి మరోసారి తనిఖీ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వాళ్లందరికీ 12 కిలోల బియ్యంతో పాటు, ఐదు వందల రూపాయల చొప్పున 9 లక్షల 19 వేల రూపాయల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డులోని ప్రతి మనిషికి ఏప్రిల్ 1 నుండి 12 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. బియ్యం తీసుకునేందుకు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించి, చౌక ధరల దుకాణాల వద్ద నిర్దేశించిన సర్కిళ్లలో నిలబడి తీసుకోవాలని, ప్రజలు బియ్యం విషయంలో ఏలాంటి ఆందోళన అవసరం లేదని, ఇంకా నెల రోజులు అయినా బియ్యం ఇస్తామని, అందరికీ సరిపడా బియ్యం నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరికి బియ్యం అందుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.


logo