శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 19:18:08

రాష్ట్రంలోని ఏ ఒక్క వ్యక్తికీ కరోనా సోకలేదు: వైద్య శాఖ మంత్రి

రాష్ట్రంలోని ఏ ఒక్క వ్యక్తికీ కరోనా సోకలేదు: వైద్య శాఖ మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క వ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏ ఒక్క వ్యక్తికి కరోనా వైరస్‌ సోకలేదన్నారు. దుబాయి, ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, వైద్యులు చికిత్స అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కరోనా సోకిన వ్యక్తి ఇంట్లోని సభ్యులకు పరీక్షలు నిర్వహించాగా, రిపోర్ట్‌ నెగెటివ్‌ వచ్చిందనీ.. ఇంట్లో వాళ్లకే వ్యాధి వ్యాపించనపుడు ఇతరులకు వచ్చే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. 

కాగా, కరోనా సోకిన వ్యక్తితో ప్రయాణించిన 47మంది ప్రయాణీకులకు గాంధీ ఆస్పత్రిలో స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించామనీ, వారిలో 45 మందికి నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని మంత్రి తెలియజేశారు. మరో ఇద్దరి రిపోర్టులలో స్పష్టత కోసం పూణెలోని వైరాలజీ కేంద్రానికి వారి శాంపిల్స్‌ పంపించామని మంత్రి వివరించారు. కరోనా నెగెటివ్‌ వచ్చిన 45 మందిని వారి వారి ఇళ్లకు పంపించినట్లు మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉంటే 24 గంటలు ఇక్కడే ఉండి సమీక్షిస్తామనీ, కమండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.

ఇక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు..

ఇప్పటి నుంచి కేవలం గాంధీ ఆస్పత్రిలోనే కాకుండా ఐసోలేషన్‌ వార్డులు ఉన్న అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వ్యాధి లక్షణాలున్న వారు శాంపిల్స్‌ ఇవ్వొచ్చనీ, అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఉండి, శాంపిల్స్‌ రిజల్ట్స్‌ వచ్చేంతవరకు వైద్య సేవలు పొందవచ్చాన్నారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు సేవలు అందించేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. వైద్యులను సమన్వయ పర్చేందుకు కమిటీ వేస్తామన్నారు. కరోనాపై వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. కరోనాకు మనిషిని చంపేంత శక్తి  లేదని వైద్యులు చెబుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ గుర్తు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులతో మనం నడుచుకునే విధానమే ఆరోగ్యాన్ని కాపాడుతుందని మంత్రి తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్క్‌ ధరించాలనీ, ఇతరులను పలకరించేటప్పుడు కరచాలనం కాకుండా, నమస్కరిస్తే చాలని మంత్రి వెల్లడించారు.


logo