శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 22:38:28

కరోనా వదంతుల పోస్టులు వద్దు: ఓ యువకుడి విజ్ఞప్తి

కరోనా వదంతుల పోస్టులు వద్దు: ఓ యువకుడి విజ్ఞప్తి

హైదరాబాద్‌: పొద్దున లేచినకాడి నుంచి రాత్రి పడుకునే దాకా కరోనానామ జపమే అయిపోయింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌లాంటి సామాజిక మాధ్యమాలనుంచి మొదలుకొని వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో అవే వార్తలు. ఇందులో అధికభాగం వదంతులే. ఇలాంటి వాటితో జనం విసిగి వేసారిపోతున్నారు. ఓ వైపు కరోనాతోనే చస్తుంటే ఈ ఫేక్‌ వార్తలు.. భయంగొల్పే కట్టుకథలేంటని తలలు పట్టుకుంటున్నారు. ఇలాగే, సహనం కోల్పోయిన ఓ యువకుడు ఊరికె కరోనా పోస్టులు పెట్టకండి ఫ్రెండ్స్‌ అంటూ విజ్ఞప్తి చేసిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

‘ఫేస్‌బుక్‌ చూసినా, వాట్సాప్‌ ఓపెన్‌ చేసినా కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా అవ్వే ఫార్వర్డ్‌లు. ఏవైనా మానసికోల్లాసం కలిగించేవి.. ధైర్యం, మనోస్థైర్యం ఇచ్చే పోస్టులు పెట్టండి. కరోనా ఫేక్‌ వార్తలు పెట్టకండి.’ అంటూ సదరు యువకుడు అసహనం వ్యక్తంచేశాడు. ఉన్నన్ని రోజులు ఉంటం.. పోయినప్పుడు పోతం.. ఊకె కరోనా గురించి భయపడడం ఎందుకు అని అన్నాడు.‘చూసి ఆనందపడేటియ్‌ పెట్టండి. కనువిందు చేసే జలపాతాల ఫొటోలు పెట్టండి.. కానీ కరోనా వార్తలు వద్దు’ అని విజ్ఞప్తి చేశాడు. కరోనా పేరుతో భయపెట్టే అడ్డమైన పోస్టులను ఫార్వార్డ్‌ చేయకండని కోరాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo