శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:10:50

కరోనా నిర్ధారణ పరీక్షల డాటా లేదు

కరోనా నిర్ధారణ పరీక్షల డాటా లేదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశం లో ఎన్ని ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే విషయం లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) చేతులెత్తేసింది. ‘ద ప్రింట్‌' అనే వెబ్‌సైట్‌.. సమాచార హక్కు చట్టం కింద ఏయే రాష్ర్టాల్లో ఎన్ని వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయో తెలియజేయాలని కోరగా, ఐసీఎమ్మార్‌ తమ వద్ద పూర్తి వివరాలు లేవని స్పష్టంచేసింది. డాటా నిర్వహణ అనేది రాష్ర్టాల బాధ్యత అని, వివరాలు అక్కడే తీసుకోవాలని సూచించింది. కరోనా మహమ్మారికి సం బంధించిన సమగ్ర డాటాను ఐసీఎమ్మార్‌ సిద్ధం చేసుకోకపోవడంపై నిపుణులు విమర్శిస్తున్నారు. 

నిజానికి దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీలను ఏకం చేస్తూ ఐసీఎమ్మార్‌ కామన్‌ పోర్టల్‌ను సిద్ధంచేసింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలను ఎప్పటికప్పుడు ల్యాబొరేటరీలు ఆ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఐసీఎమ్మార్‌ అన్ని రాష్ట్రాల డాటాను క్రోడీకరించి దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలను ప్రకటిస్తుంది. ల్యాబొరేటరీలు చేస్తున్నది ఆర్టీపీసీఆర్‌ లేదా ర్యాపిడ్‌ పరీక్షలు అనే విషయంలో మా త్రం డాటా తీసుకోవడం లేదు. రెండు రకాల పరీక్షల వివరాలు చెప్పాలని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేయగా లోపం బయటపడింది.