మంగళవారం 26 మే 2020
Telangana - May 13, 2020 , 01:52:32

కరోనావైరస్‌లో మార్పు లేదు

కరోనావైరస్‌లో మార్పు లేదు

  • విదేశాల్లో, భారత్‌లో విస్తరిస్తున్నది ఒక్కటే
  • జన్యుక్రమంలో 99 శాతం ఒకటే పోలిక
  • భారతీయులపై వైరస్‌ ప్రభావం తక్కువ
  • మహిళలకన్నా పురుషులపై అధిక ప్రభావం
  • ఇందుకు కారణాలను అన్వేషిస్తున్నాం
  • సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : విదేశాలలో, భారత్‌లో విస్తరిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌కు తేడా ఏమీ కనిపించలేదని, వాటి జన్యుక్రమం 99 శాతం ఒక్కటేనని తమ ప్రాథమిక పరిశోధనలో వెల్లడైందని సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. అయితే అమెరికాతోపాటు ఐరోపా దేశాలలో ఆ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండటానికి, మన దేశంలో తక్కువగా ఉండటానికి కారణాలను పరిశీలిస్తున్నామని పేర్కొంది. మరోవైపు ఈ వైరస్‌ ప్రభావం మహిళలపై కంటే పురుషులపై ఎందుకు అధికంగా ఉందన్న దానిపై కూడా పరిశోధన జరుపుతున్నామని తెలిపింది. విదేశాలలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌కు, మన దేశంలో విస్తరిస్తున్న వైరస్‌కు తేడా ఉన్నదా? భారత్‌లో వ్యాపిస్తున్న వైరస్‌ కోరలు బలహీనమైనవా అన్న సందేహాలను నివృత్తి చేయడానికి, వైరస్‌ జన్యుక్రమాన్ని గుర్తించడానికి సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సీ ప్రయోగాన్ని ముమ్మరం చేసింది. 

ఇప్పటివరకు 70 రకాల నమూనాలను పరిశీలించామని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చెప్పారు. సీసీఎంబీకి పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి వైరస్‌ నమూనాలు వస్తున్నాయి. ఈ నమూనాల ఆధారంగా జీనోమ్‌ సీక్వెన్సీ పరిశోధనను ముమ్మరం చేశారని మిశ్రా నమస్తే తెలంగాణకు చెప్పారు. మరో వారం రోజుల్లో తమ పరిశోధన పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటివరకు జన్యువులను వేరు చేశామని చెప్పారు. వాటిని మన దేశంలో, విదేశాలలో విస్తరిస్తున్న వైరస్‌ జన్యుక్రమంతో పోల్చి చూస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటివరకు తమ పరిశీలనలో వైరస్‌ జన్యుక్రమంలో తేడా కనిపించలేదని, 99 శాతం ఒకేవిధంగా ఉందని వివరించారు. 

భారత్‌లో విస్తరిస్తున్న వైరస్‌ తీవ్రత తక్కువ (లెస్‌ వైరులెంట్‌)గా ఉందన్న అభిప్రాయంపై విభేదిస్తున్నట్టు తెలిపారు. అయితే వైరస్‌ ప్రభావం భారతీయులకంటే విదేశీలయుపై అధికంగా ఉండటం వాస్తవమని చెప్పారు. ‘భారతీయులపై వైరస్‌ ప్రభావం తక్కువగా ఉండటానికి కారణమేమిటి? మన ఆహారపు అలవాట్లా.. భిన్నమైన జన్యు నిర్మాణమా.. గతంలో ఇటువంటి వ్యాధులను ఎదుర్కోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగిందా? అన్న కోణంలో పరిశోధన జరుపుతున్నామని తెలిపారు. మరోవైపు కరోనా ప్రభావం పురుషులపై అధికంగా ఉందన్నారు. నూటికి 75శాతం మంది పురుషులు వ్యాధి బారినపడుతున్నారని చెప్పారు. వైరస్‌ మహిళలపై తక్కువ ప్రభావం చూపడానికి కారణాలను కూడా అన్వేషిస్తున్నామని తెలిపారు. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్న లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలకు తమవంతు సహకారం అందిస్తున్నామని రాకేశ్‌మిశ్రా చెప్పారు.logo