ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:39:02

మనం భద్రమే

మనం భద్రమే

  • రాష్ట్రంలో ఆనవాళ్లు లేవు.. అయినా జాగ్రత్తలు
  • సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. బుధవారం అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు రాజస్థాన్‌లో మాత్రమే బర్డ్‌ఫ్లూ ఉన్నట్టు కేంద్రం గుర్తించిందని తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏర్పాటుచేసిన 1,300 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. పశు సంవర్ధశాఖ అధికారులు కోళ్ల పరిశ్రమ నిర్వాహకులకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారని పేర్కొన్నారు. 

రాష్ర్టానికి భయం లేదు

బర్డ్‌ఫ్లూపై అంతగా భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఆ వైరస్‌ వ్యాపించే అవకాశం చాలా తక్కువని పశుసంవర్ధక శాఖ చెప్తున్నది. ఒకవేళ వచ్చినా అది నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే పరిమితమవుతుందని అధికారులు భావిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తికి వలసపక్షులు, చికెన్‌ దిగుమతులే ముఖ్య కారణమని, ఆ రెండింటికీ మన దగ్గర అవకాశాలు లేవని చెప్తున్నారు. 

మనకు ముప్పులేదు

బర్డ్‌ఫ్లూ వ్యాప్తికి చికెన్‌ దిగుమతులు ఒక కారణమని కానీ, రాష్ట్రం నుంచి చికెన్‌ ఎగుమతులే ఉంటాయి తప్ప దిగుమతులకు అవకాశం లేదని పశుసంవర్ధకశాఖ అధికారులు వివరిస్తున్నారు. గతంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిన సమయంలో పక్షులు, కోళ్లకు జరిపిన పరీక్షల్లో హెచ్‌5ఎన్‌1 వైరస్‌ బయటపడగా.. ప్రస్తుతం శాస్త్రవేత్తలు రెండురకాల వైరస్‌లను గుర్తించారు. రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో హెచ్‌5ఎన్‌1 వైరస్‌ గుర్తించగా.. కేరళలో బాతుల్లో హెచ్‌5ఎన్‌8 వైరస్‌ బయటపడింది. 2015లో తెలంగాణలో బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించాయి. 

మనుషులకు ప్రమాదం లేదు

బర్డ్‌ఫ్లూ వైరస్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. దేశంలో ఇప్పటివరకు పలుమార్లు వైరస్‌ వ్యాపించినప్పటికీ మనుషులపై అది అంతగా ప్రభావం చూపలేదని పేర్కొంటున్నారు. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయే తప్పా మరణించేంత ప్రమాదం ఉండదని.. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని పేర్కొన్నదని వివరిస్తున్నారు. ప్రతినిత్యం శాంపిల్స్‌ పరీక్ష రాష్ట్రంలో ఎనిమిది లక్షలకుపైగా కోళ్లతో పౌల్ట్రీ పరిశ్రమ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటు పశుసంవర్ధకశాఖ, అటు పౌల్ట్రీ వ్యాపారులు కోళ్లకు ఎలాంటి వైరస్‌లు సోకకుండా నిత్యం చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడుగా పశు సంవర్ధకశాఖ తరపున 1,300 ర్యాపిడ్‌ యాక్షన్‌ టీంలు ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి కోళ్లను పరిశీలిస్తున్నాయి. ప్రతిరోజు శాంపిల్స్‌ తీసుకొని హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే ఆ శాంపిల్స్‌ను వెంటనే బెంగళూరు, భోపాల్‌లోని హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తున్నారు.