గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:30

పేద మైనారిటీలకు చేయూత- ఎన్‌ఎండీఎఫ్‌సీ

పేద మైనారిటీలకు చేయూత- ఎన్‌ఎండీఎఫ్‌సీ

జాతీయ అల్పసంఖ్యాకవర్గాల అభివృద్ధి, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీఎఫ్‌సీ) ను పీవీ ప్రభుత్వం 1994 సెప్టెంబర్‌ 30వ తేదీన ఏర్పాటు చేసింది. అల్పసంఖ్యాకవర్గాలలోని వెనుబడిన వారికి, అందులోనూ వృత్తివర్గాలకు లబ్ధి చేకూర్చే ఆర్థిక, అభివృద్ధి పథకాలను చేపట్టడం కమిషన్‌ ప్రధాన విధి. మైనారిటీలలోని వెనుకబడిన వర్గాలు జీవితంలో నిలదొక్కుకునే పథకాలకు రుణాలు, ప్రాజెక్టులు చేపట్టడం కమిషన్‌ లక్ష్యం. స్వయం ఉపాధి పథకాలకు ఈ సంస్థ రుణాలు ఇస్తుంది. వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే పథకాలను పర్యవేక్షిస్తుంది. మైనారిటీలుగా మొదట ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలను మాత్రమే గుర్తించారు. ఆ తరువాత జైనులను కూడా ఈ జాబితాలో చేర్చారు. రూ.20 లక్షల మేర ప్రాజెక్టులకు కూడా ఎన్‌ఎండీఎఫ్‌సీ రుణాలు ఇస్తుంది. 90 శాతం అంటే పద్దెనిమిది లక్షల రూపాయలు ఎన్‌ఎండీఎఫ్‌సీ ఇస్తే మిగతా పది శాతం రాష్ట్ర ఏజెన్సీ సమకూరుస్తుంది. ఎన్‌ఎండీఎఫ్‌సీ వడ్డీ రేటు ఆరు శాతం కాగా ఐదేండ్లలో తేర్పవలసి ఉంటుంది. రాష్ట్ర ఏజెన్సీ వంతు రుణానికి మూడు శాతం వడ్డీరేటు ఉంటుంది. దీనిని ఎనిమిది ఏండ్లలో చెల్లించవలసి ఉంటుంది. 

ఉద్యోగం లక్ష్యంగా ఉండే ఉన్నత చదువులకు కూడా ఎన్‌ఎండీఎఫ్‌సీ రుణాలు ఉపయోగపడుతాయి. పదిహేను లక్షల వరకు ఇచ్చే ఈ రుణాన్ని ఏడాదికి మూడు లక్షల వంతున అందజేస్తారు. విదేశాలలో చదువు కోసం ఇరువై లక్షల మేర రుణమిస్తారు. చదువు పూర్తయిన తరువాత ఐదేండ్లలో రుణాన్ని తేర్పవలసి ఉంటుంది. కోర్సు పూర్తయిన తరువాత ఆరు నెలల వరకు మారటోరియం ఉంటుంది. స్వయం సహాయక బృందాలకు కూడా ఎన్‌ఎండీఎఫ్‌సీ సూక్ష్మస్థాయి రుణాలు ఇస్తుంది. బంగ్లాదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌, రాష్ట్రీయ మహిళా కోశ్‌ తరహాలో ఈ ఎన్‌ఎండీఎఫ్‌సీ పేదలనఆదుకుంటుంది. స్వయం సహాయక బృందంలోని ప్రతి సభ్యురాలికి లక్ష రూపాయల వరకు రుణం ఇవ్వవచ్చు. మూడేండ్లలో మళ్ళీ చెల్లించవలసి ఉంటుంది,

ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కోసం ఎన్‌ఎండీఎఫ్‌సీ స్వల్ప రుణాలు ఇస్తుంది. చేతి వృత్తుల వారికి రుణాలు ఇవ్వడమే కాకుండా, మార్కెటింగ్‌ సహాయాన్ని కూడా అందిస్తుంది. వీరి తరఫున ప్రదర్శనలు నెలకొల్పడానికి తోడ్పడుతుంది. అమ్మకం, కొనుగోలుదార్లకు మధ్య సంధానం కోసం ఈ ప్రదర్శనలు ఉపయోగపడుతాయి. ఆధునిక సమాజం ఇష్టాయిష్టాలను గమనించి చేతి వృత్తులను మెరుగు పరుచుకునేందుకు తోడ్పడుతుంది. డిజైనింగ్‌, వృత్తి నైపుణ్యం అభివృద్ధి కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. విస్తృతమైన రీతిలో పలు స్వయం ఉపాధి పథకాలకు ఎన్‌ఎండీఎఫ్‌సీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. పూల తోటలు, పుట్టగొడుగుల పెంపకం, పౌల్ట్రీ వంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు లభిస్తాయి. బార్బర్‌ షాప్‌, వడ్రంగి, లాండ్రీ, మరమగ్గాలు మొదలైన వృత్తి పనులకు కూడా రుణం ఇస్తుంది. బేకరీ, స్టేషనరీ, చెప్పుల దుకాణం, పాన్‌షాప్‌, ఎరువులు లేదా విత్తనాల దుకాణం, ఫొటోకాపీ సెంటర్‌, హార్డ్‌వేర్‌ స్టోర్‌, కూరగాయల బండి, కేబుల్‌ టీవీ మొదలైన స్వయం ఉపాధి కార్యక్రమాలకు కూడా రుణాలు పొందవచ్చు. logo