ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 02:14:38

ఇందూరులో భారీ పోలింగ్‌ 99.64% ఓటింగ్‌ నమోదు

ఇందూరులో భారీ పోలింగ్‌ 99.64% ఓటింగ్‌ నమోదు

  • నిజామాబాద్‌ స్థానిక సంస్థలఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతం
  • 12న ఓట్ల లెక్కింపు
  • పార్టీలకు అతీతంగా కవితకు మద్దతు 
  • భారీ మెజారిటీ ఖాయమన్న వేముల
  • మొత్తం ఓటర్లు: 824 ,ఓటువేసినవారు : 821 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కమిషన్‌ తీసుకున్న చర్యలతో కొవిడ్‌-19 బాధితులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లోని 50 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 9గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 5గంటలకు ముగిసింది. మొత్తం 824 మంది ఓటర్లకుగాను 821 మంది ఓట్లేయడంతో 99.64% పోలింగ్‌ నమోదైంది. ఈ నెల 12న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో బాన్సువాడలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భీంగల్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ నగరంలోని జెడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌తోపాటు ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌, వీ గంగాధర్‌గౌడ్‌, ఆకుల లలిత ఓటు వేశారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డిలో సురేందర్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఓటేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డి, బోధన్‌ పట్టణాల్లో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. 

99.64% పోలింగ్‌ నమోదు

స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి రెండుగంటల్లోనే భారీస్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైంది. నిజామాబాద్‌, కామారెడ్డి రెండు జిల్లాల్లో మొత్తం 824 మంది ఓటర్లుండగా.. 821 మంది ఓటువేశారు. కామారెడ్డి జిల్లాలోని మొత్తం 341 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 483 మందికిగాను 480 మంది ఓటువేశారు. ఓటరు జాబితాలోని ఒకరు ఇటీవల మృతిచెందగా, మరో ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 99.64% పోలింగ్‌ నమోదైందని రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి ప్రకటించారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఇద్దరు ప్రజాప్రతినిధులు 12వ తేదీ ఉదయం 8గంటల వరకు ఓటు నమోదు పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఓటేసిన కరోనా బాధితులు...

కరోనా సోకిన 24 మంది స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. వీరికి ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. వారి ఇంటికే 108 అంబులెన్సు పంపడంతోపాటు పోలింగ్‌ కేంద్రాల్లో పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచింది. 

కవిత పర్యటన

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. కామారెడ్డి, బోధన్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులతో ముచ్చటించారు. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కవితతో సెల్ఫీలు, ఫొటోలు దిగి సంబురపడ్డారు. కవితకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అడ్వాన్స్‌ కంగ్రాట్స్‌ తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 

కవితమ్మకు 90% ఓట్లు: వేముల

ఓటర్లు అంతరాత్మ ప్రబోధానుసారమే ఈ ఉప ఎన్నికలో ఓటేశారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. భీంగల్‌లో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో పలువురు స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కవితమ్మకు మద్దతు తెలుపుతున్నామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో చెప్పారన్నారు. ఈ ఉప ఎన్నికలో 90% ఓట్లు కవితమ్మకు వస్తాయని భావిస్తున్నట్లు వేముల పేర్కొన్నారు. మిత్రపక్షం ఎంఐఎం, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు కూడా టీఆర్‌ఎస్‌కు ఉన్నదన్నారు. కవితమ్మకు మద్దతుగా వచ్చిన ఆయా పార్టీల నాయకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఇరు పార్టీల ఓట్లు కలిపి లెక్కించినా డిపాజిట్‌కు కావాల్సినన్ని రావని జోస్యం చెప్పారు.

కవిత గెలుపు ఏకపక్షమే: మహేశ్‌ బిగాల

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో ఏకపక్షంగా విజయం సాధించడం ఖాయమని టీఆర్‌ఎస్‌ ఎన్నారై సమన్వయకర్త మహేశ్‌ బిగాల అన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 824 ఓట్లు ఉండగా, అందులో 90% ఓట్లు కవితకే వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బాండు పేపరుతో మోసగించిన వ్యక్తిని గెలిపించి పొరపాటు చేశామని ప్రజలు గ్రహించారన్నారు. అన్ని ఎన్నికల మాదిరిగానే.. ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కవిత గెలుపు నిజామాబాద్‌ జిల్లాకు పూర్వవైభవం తీసుకువస్తుందని పేర్కొంటూ.. ఆమెకు ఎన్నారైల పక్షాన ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 


logo