ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 09:10:20

ప్రారంభ‌మైన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

ప్రారంభ‌మైన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.  నిజామాబాద్ జిల్లాలో 483 మంది, కామారెడ్డిలో 341 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 67 మంది ఓటర్లు ఉండగా, చందూర్ మండల పరిషత్లో అత్యల్పంగా నలుగురు ఓటర్లు ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 12న ఫలితాలు వెలువడనున్నాయి. 

కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలో 24 మంది కరోనా పాజిటివ్లు ఓటేయనున్నారు. ఇందులో ఒకరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయనున్నారు. మిగిలినవారందరూ పీపీఈ కిట్లు ధరించి పోలింగ్ చివరి గంటలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ఓటు వేయనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వ‌ర్‌తోపాటు  ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓటు వేయనున్నారు. ఎమ్మెల్యే షకీల్ బోధ‌న్‌లో, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డిలో, ఎమ్మెల్యే సురేందర్ ఎల్లారెడ్డిలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.   


logo