గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:45:35

ఏప్రిల్‌ 7న ఉపఎన్నిక

ఏప్రిల్‌ 7న ఉపఎన్నిక
  • నిజామాబాద్‌ ‘స్థానిక ఎమ్మెల్సీ’ స్థానానికి
  • షెడ్యూల్‌ విడుదల ..12 నుంచి నామినేషన్లు
  • ఎమ్మెల్సీని కైవసం చేసుకోనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌/నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్‌ 7న ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికలసంఘం గురువారం విడుదల చేసింది. టీఆర్‌ఎస్‌ తరపున ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి పార్టీ ఫిరాయించడంతో 2019 జనవరి 16న అనర్హత వేటుపడింది. ఖాళీగా ఉన్న ఈ స్థానానికి 12 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరణ, 20న పరిశీలన, 23న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అదేరోజున బరిలో నిలిచిన అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తారు. 


అనివార్యమైతే ఏప్రిల్‌ 7న ఎన్నికలు నిర్వహించి 9న ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికయ్యే ఎమ్మెల్సీ పదవీకాలం 2022 జనవరి నాలుగో తేదీ వరకు ఉంటుంది. రాష్ట్రంలో 2019 జూన్‌లో మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో భూపతిరెడ్డిపై అనర్హత వేటు తర్వాత అవసరమైన సంఖ్యలో ఓటర్లు(స్థానిక సంస్థల ప్రతినిధులు) లేక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించలేదు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలు పూర్తవడంతో అవసరమైన సంఖ్యలో ఓటర్లు ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదలచేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటుహక్కు వినియోగించుకోవడానికి అర్హులు. నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అత్యధికులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే. దీంతో ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సులువుగా గెలుచుకోనున్నారు. 


రెండు కోర్టుల్లోనూ ఎదురుదెబ్బ

టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భూపతిరెడ్డికి ఇచ్చిన హామీమేరకు ఆరేండ్ల కాల పరిమితి ఉన్న ఎమ్మెల్సీ పదవికి గతంలో ఆయనను స్థానిక సంస్థల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన భూపతిరెడ్డి.. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కయ్యానికి కాలుదువ్వి అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున రూరల్‌ నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. అప్పటికే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా భూపతిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని అధిష్ఠానాన్ని కోరారు. పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో మండలి చైర్మన్‌ అనర్హత వేటువేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ భూపతిరెడ్డి హైకోర్టుకు వెళ్లగా ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అనర్హత వేటు సబబేనని అక్కడా అదే తీర్పురావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 


logo
>>>>>>